Operation TSRTC: ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతర్, నిరవధిక సమ్మె వైపు కార్మికుల అడుగులు, కొత్త నియామకాలు చేపడుతున్న టీఎస్ సర్కారు, కార్మికులకు ఇంకా అందని జీతాలు, ఉద్యోగులకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం

సాయంత్రం ఆరుగంటల్లోగా విధుల్లో చేరాలని లేకుంటే వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వైపు చూస్తోంది.

TSRTC unions begin indefinite strike in Telangana (Photo-Twitter)

Hyderabad,october 5: ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన గడువు పూర్తయింది. సాయంత్రం ఆరుగంటల్లోగా విధుల్లో చేరాలని లేకుంటే వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వైపు చూస్తోంది. విధుల్లో చేరని వారిని ఉద్యోగులుగా పరిగణించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు రెడీ అవుతోంది. 6 వేల మందిని తాత్కాలికంగా నియమించుకోవాలని నిర్ణయించింది. ఉన్నతాధికారులు ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభించారు. 4వేల మంది డ్రైవర్లు, 2వేల మంది కండక్టర్లను కాంట్రాక్ట్ పద్దతిలో నియమించాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. తాత్కాలిక సిబ్బందితో డిపోల నుంచి బస్సులను బయటకు తీయాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే క్యాబ్ లు, స్కూల్, కాలేజీ బస్సులను తిప్పుతున్నారు. అయినప్పటికీ ప్రయాణికుల అవసరాలకు ఇవి సరిపోకపోవడంతో ఉద్యోగులకు చివరిగా మరో అవకాశం ఇచ్చి చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమ్మె రోజైన శనివారం 9 వేల బస్సులను నడిపామని ఆర్టీసీ చెబుతోంది. అందులో ఆర్టీసీ బస్సులు 2 వేల 129, అద్దె బస్సులు వేయి 717, ప్రైవేటు బస్సులు వేయి 155, కాలేజీ బస్సులు వేయి 195, మ్యాక్సీ క్యాబ్, ఇతర వాహనాలు 2 వేల 778 తిప్పినట్లు వెల్లడించింది.

ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఇంకా జీతాలు అందుకోలేదు. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ప్రతి నెలా ఒకట తేదీనే వేతనాలు అందుతుంటాయి. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా జీతాలు చెల్లించలేకపోయింది. అక్టోబర్ 05వ తేదీన వీరు వేతనాలు అందుకోనున్నారు. అంతేగాకుండా కార్మికులు సమ్మె బాట పట్టడం..వేతనాల్లో జాప్యం కావడంతో ఉత్కంఠ నెలకొంది. పండుగ వేళ జాతాలు రాకపోవడంతో కార్మిక కుటుంబాల్లో ఆందోళ నెలకొంది. సాయంత్రం 6 గంటల్లోపు విధులకు హాజరు కాకపోతే వారిని ఉద్యోగులుగా గుర్తించమని ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జీతాలు పడుతాయో లేదోనన్న టెన్షన్ వారిలో నెలకొంది.

తెలంగాణా సీఎంఓ హెచ్చరిక

కాగా సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆర్టీసీలో మైలేజ్ అయిపోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దెబస్సులు తీసుకోవాలని, ఇందుకోసం నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారు. ప్రజల అసౌకర్యాన్ని వీలయినంత తగ్గించేందుకు ఇప్పటికిప్పుడు ఇతర రాష్ట్రాలనుంచి బస్సులు తెప్పించాలని, రాష్ట్రంలోని ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేషన్లపై కొంత ఉదారంగా ఉండాలని సూచించారు. ప్రైవేటు వాహనాలకిచ్చే పర్మిట్ రుసుంలో 25% రాయితీ ఇవ్వాలని చెప్పారు. సరిహద్దులో ఉన్న జిల్లాలకు వాటి పక్కరాష్ట్రాల నుంచి ప్రైవేటుబస్సులను తెప్పించాలని సూచించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు తగిన భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించారు. బస్సుడిపోల వద్ద భద్రత కల్పించాలని, బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

టీఎస్సార్టీసీ కార్మికుల డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను టీఎస్సార్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ సందర్భంగా జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, వచ్చే రెండు రోజులకు తమ కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు. రేపు అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ లేఖలు ఇస్తామని చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, సాయంత్రం 5 గంటలకు అన్ని డిపోల దగ్గర కార్మికుల కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడతారని, ఎల్లుండి ఉదయం 8 గంటలకు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పిస్తామని, అనంతరం, ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.