Hyderabad Floods Videos: హైదరాబాద్ వరద బీభత్సం ఎలా ఉందో వీడియోల్లో చూడండి, మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా చెరువులను తలపించిన రోడ్లు
జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి.
Hyd, Sep 6:ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. బాచుపల్లి ప్రగతినగర్ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. రెజిమెంటల్ బజార్‌లో పురాతన భవనం కూలిపోయింది.
రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్ జాతీయ రహదారిపై, శ్రీనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. డీఆర్‌ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు అతికష్టం మీద ఆ బస్సులను వరద నుంచి బయటకు తీశారు.
రికార్డు స్థాయిలో సుమారు 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకు 14.7 సెం.మీ.. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెం.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Here's Videos
కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Hyderabad Floods Videos
రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్‌పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని అలర్ట్ ప్రకటించింది.
వర్ష సమస్యలపై కాల్ చేయండి
జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ : 040– 21 11 11 11
డయల్ 100 ∙ఈవీడీఎం కంట్రోల్‌రూమ్: 9000113667