Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు, మరో 4 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, అత్యవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్‌ఎంసీ సూచన
ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Hyd, June21: తెలంగాణలో రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rains in Telangana) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతాలతో పాటు మరిన్ని ఏరియాల్లో 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సంచాలకులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై, సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి వానలు దంచికొట్టాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ జంటనగరాలతో పాటు జిల్లాల్లో భారీ వర్షం (Telangana Rains) కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 12.9 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో 12.5 సెంటీమీటర్లు, సుల్తాన్‌పూర్‌లో 12.3 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డిలో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఖమ్మం, సూర్యాపేట, ఆదిలాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Latest News on Rain forecast for telangana) కురిశాయి.
తెలంగాణలో కొత్తగా 246 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాద్‌లో 185 మందికి వైరస్
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంత్రాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. షేక్‌పేట, గోల్కొండ, టోలీచౌకి, మెహదీపట్నం, శేరిలింగంపల్లి, చందానగర్, కొండాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, బోయినపల్లి, బేగంపేట, ప్యారడైజ్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, చిలకలగూడ ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. మదాపూర్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, సోమాజిగూడ, బోయినపల్లి, అల్వాల్, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, చార్మినార్, చాంద్రయాణగుట్ట, ఫలక్‌నుమా, బార్కస్, యాకుత్‌పురా, బహదూర్‌పురాతో పాటు చేవేళ్ల, నాగారం పరిసరాల్లోనూ వాన కురియగా.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నేరెడ్‌మెట్‌లో భారీ వర్షానికి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది.
అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా భారీ వర్షానికి ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. వర్షంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున సైతం వర్షం కురిసింది. కూకట్‌పల్లిలో ఆరు సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్‌లో 5.2, ఖైతరాబాద్‌లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం నేపథ్యంలో డీఆర్‌ఎఫ్ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి సూచించారు. అత్యవసర పనులైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలుంటే వెంటనే 040 21111111 నంబరులో సంప్రదించాలన్నారు