Telangana: తాగుబోతు భర్త వేధింపులు, తట్టుకోలేక పిల్లలను రైలు కింద తోసి..తాను రైలు కింద పడి, తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయిన ఇల్లాలు, చికిత్స పొందుతూ కూతురు మృతి, బాబు పరిస్థితి విషమం, రామగుండంలో విషాద ఘటన
రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్తతో వేగలేక ఆమె మరణమే (Woman commit suicide) శరణ్యమని భావించింది. తాను లేకుంటే పిల్లలు ఏమవుతారోనని వారినీ కూడా తన వెంట తీసుకెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకుంది.
Ramagundam, July 12: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో (Telangana Ramagundam) విషాద ఘటన చోటు చేసుకుంది. రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్తతో వేగలేక ఆమె మరణమే (Woman commit suicide) శరణ్యమని భావించింది. తాను లేకుంటే పిల్లలు ఏమవుతారోనని వారినీ కూడా తన వెంట తీసుకెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలను ఎదురుగా వస్తున్న రైలుకింద తోసి.. తాను దూకింది. ఈ సంఘటనలో తల్లి అక్కడికక్కడే మృత్యువాత పడగా.. గాయపడిన పిల్లలిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడ ఓ చిన్నారి కన్నుమూసింది.
రామగుండం జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి గంగారపు తిరుపతి తెలిపిన కథనం ప్రకారం.. స్థానిక యైటింక్లయిన్‌కు చెందిన జంగేటి ప్రవీణ్‌కు ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఓరుగంటి వెంకటరమణ కుమార్తె అరుణతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాత్విక్ (5), కూతురు సాత్విక (2) ఉన్నారు. ప్రవీణ్ కొంత కాలంగా పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని అరుణను వేధించసాగాడు.
ఆ వేధింపులు భరించలేక అరుణ జీవితంపై విరక్తి చెంది.. తాను చనిపోతే పిల్లలు ఒంటరి వారవుతారని భావించి పిల్లలతో సహా రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. మధ్యాహ్నం రెండుగంటలకు సికింద్రాబాద్ నుంచి దాణాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తున్న క్రమంలో ముందుగా పిల్లలను తోసింది. అనంతరం తానూ రైలు కింద పడింది. అయితే రైలు కొద్దిదూరంలో ఉండడంతో గమనించిన లోకోపైలట్ హారన్ మోగించాడు. సడన్ బ్రేక్ వేసినా ఫలితం లేకపోయింది.
రైలు తల్లితోపాటు ఇద్దరు చిన్నారులపైకి కొద్దిదూరం దూసుకెళ్లింది. రైలు ఆగాక లోకోపైలట్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ముగ్గురినీ రైలు కింద నుంచి బయటకు తీశారు. అరుణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. పిల్లలు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా.. వారిని 108లో గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాత్విక మృతి చెందింది. బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అరుణ తండ్రి వెంకటరమణ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.