Special Buses Sankranti Festival: సంక్రాంతి ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల బస్సులు
నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ (టీజీఆర్టీసీ) ఏకంగా 5 వేల ప్రత్యేక బస్సులు ప్రకటించింది.
Hyderabad, Dec 28: హైదరాబాద్ (Hyderabad)) లో ఉంటూ సంక్రాంతి పండుగకు (Special Buses Sankranti Festival) ఊరెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న ఆంధ్రవాసులకు శుభవార్త. నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ (టీజీఆర్టీసీ) ఏకంగా 5 వేల ప్రత్యేక బస్సులు ప్రకటించింది. ఏపీతోపాటు తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఈ బస్సులు నడవనున్నాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో అటు ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి 2,400 ప్రత్యేక బస్సులు నడపనుంది. జనవరి 9 నుంచి 13 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని సాధారణ చార్జీలతోనే నడపనున్నట్టు అధికారులు తెలిపారు.
మరి ఉచిత సర్వీసులు?
తెలంగాణ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తెలంగాణ సరిహద్దుల వరకు ఈ అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దాటిన తర్వాత టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. జనవరి తొలి వారం నుంచి 17వ తేదీ వరకు పది రోజులపాటు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వివరించారు.