2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటరు మహాశయులు.. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇతరత్రా ప్రముఖులు

175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలున్న ఏపీలో ఓటింగ్ ప్రారంభమైంది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్‌ సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది.

AP TS Voting-Jagan, AlluArjun, Jr. NTR (Credits: X)

Hyderabad, May 13: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఓట్ల పండుగ (Voting Day) మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలున్న ఏపీలో ఓటింగ్ ప్రారంభమైంది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్‌ సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది. ఇరు రాష్ట్రాలలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6.30 గంటలకే భారీ క్యూ లైన్లు కనిపించాయి. వేర్వేరు పనులు, తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏపీలో ఎన్నికల సమాచారం విషయానికి అసెంబ్లీ బ‌రిలో 2387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ బ‌రిలో 454 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఓటేసిన ప్రముఖులు

కడపలోని భాకరాపురంలో సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ప్రజలందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్ తదితరులు కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

దేశవ్యాప్తంగా నాలుగో విడుత..

దేశవ్యాప్తంగా 4వ లోక్‌ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ మొదలైంది. పోలింగ్ కేంద్రాలకు వందలాది మంది ఓటర్లు క్యూకట్టి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.