Ai Powered Spam Detection Solution: స్పామ్ కాల్స్, మేసేజ్ లకు చెక్ పెట్టేందుకు ఎయిర్ టెల్ సూపర్ ప్లాన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పనిచేసే వ్యవస్థ ఏర్పాటు
తమ కస్టమర్ల కోసం ఇన్‌హౌస్ టూల్‌గా ఎయిర్‌టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై కస్టమర్‌లకు రియల్-టైమ్ అలర్ట్స్‌ను అందిస్తుంది.
New Delhi, SEP 25: స్పామ్, అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల (Spam Calls) బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఇవి మొబైల్ యూజర్లను విసిగించడమే కాకుండా వారిని మోసాలకు సైతం గురిచేస్తున్నాయి. ఈ ముప్పును అరికట్టడానికి భారతీ ఎయిర్‌టెల్ (Airtel) సంచలన ఫీచర్‌ను తీసుకొచ్చింది. “దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్‌వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను (Ai Powered Spam Detection) ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్‌హౌస్ టూల్‌గా ఎయిర్‌టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై కస్టమర్‌లకు రియల్-టైమ్ అలర్ట్స్‌ను అందిస్తుంది. తద్వారా అటువంటి అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు చాలా వరకు కట్టడయ్యే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.
“స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. మేము గత పన్నెండు నెలలుగా దీనిని సమగ్రంగా పరిష్కరించడం కోసం కృషి చేశాం. దేశ మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్-రహిత నెట్‌వర్క్‌ను ప్రారంభించడం ద్వారా ఈ రోజు ఒక మైలురాయిని సూచిస్తుంది“ అని ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఫీచర్‌ను తమ కస్టమర్లకు ఎయిర్‌టెల్ (Airtel) ఉచితంగా అందించనుంది. వినియోగదారులందరికీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేస్తారు. అంటే దీని కోసం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాల్సిన పని గానీ, దానిని యాక్సెస్ చేయడానికి ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం గానీ లేదు.
ఈ సిస్టమ్ డ్యూయల్-లేయర్డ్ “AI షీల్డ్”ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుందని ఎయిర్‌టెల్ వివరించింది. ఇది నెట్‌వర్క్ అలాగే ఐటీ సిస్టమ్ స్థాయిలు రెండింటిలోనూ ప్రతి కాల్‌ను, ఎస్‌ఎంఎస్‌ని ఫిల్టర్ చేస్తుంది. ఇది సందేశాలను గుర్తిస్తుండగా ప్రతిరోజూ 150 కోట్ల మేసేజ్‌లను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేసి 30 లక్షల స్పామ్ ఎస్‌ఎంఎస్‌లు, 10 కోట్ల స్పామ్ కాల్స్ గుర్తించగలదని విట్టల్ వెల్లడించారు.