Anil Ambani (photo-Wikimedia Commons )

అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ స్టాండలోన్‌ రుణాల (standalone external debt)ను భారీగా తగ్గించుకుంది. మొత్తం రుణాలను రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి. బకాయిలు తగ్గించుకున్న తర్వాత రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కంపెనీ నికర విలువ రూ.9,041 కోట్లుగా ఉందని కంపెనీ తన ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), ఎడెల్‌వీస్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌తో పాటు ఇతర రుణదాతల బకాయిలు క్లియర్ చేసినట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా స్పష్టంచేసింది. దీంతో తన స్టాండలోన్‌ మొత్తం రుణాలు 87శాతం తగ్గి రూ.475 కోట్లకు చేరాయి.

ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం

ఈ పరిస్థితుల మధ్య రిలయన్స్ పవర్‌ కు అతిపెద్ద ఆర్డర్ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ-రివర్స్ ఆక్షన్ ద్వారా 500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టు లభించినట్టు రిలయన్స్ పవర్ ప్రకటించింది. ఆ ప్రకటన రాగానే రిలయన్స్ పవర్ షేర్లు పైకి ఎగబాకాయి. సోమవారం రిలయన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఆ రోజు రిలయన్స్ పవర్ షేర్ రూ. 30.30 వద్ద ప్రారంభమైంది. ఆర్డర్ అందుకున్న తర్వాత 31.32 రూపాయలకు చేరుకుంది. మంగళవారం కూడా ఇదే జోరు కొనసాగింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే 31.51 రూపాయలకు చేరుకుంది.

ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ షేర్లు గత నాలుగున్నర సంవత్సరాలలో 2671 శాతం రాబడినిచ్చాయి. 27 మార్చి 2020న రిలయన్స్ పవర్ షేర్లు రూ.1.13కి చేరాయి. నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఒక్కో షేరు రూ.31.32కి చేరింది. అంటే అప్పట్లో ఈ షేర్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఈరోజు రూ.27.71 లక్షలు సొంతం చేసుకోబోతున్నట్టే.