Play Store Update:నకిలీ యాప్స్ గుర్తించేందుకు కీలక అప్ డేట్ ఇచ్చిన గూగుల్ ప్లే స్టోర్, ఇకపై గవర్నమెంట్ యాప్స్ ను ఇలా గుర్తించవచ్చు
ప్రభుత్వ ఖాతాలను (Government Apps) సులువుగా గుర్తించేందుకు ‘ఎక్స్’లో గ్రే టిక్ ఇచ్చారు. దీంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్నవారిని సులువుగా గుర్తించడం సాధ్యపడుతోంది. అచ్చం ఆ తరహాలోనే గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేబుల్‌ను తీసుకొచ్చింది.
New Delhi, May 03: ఏదైనా యాప్ కోసం ప్లే స్టోర్‌లో (Playstore) సెర్చ్ చేయగానే అదే పేరుతో పలు అప్లికేషన్లు దర్శనమిస్తాయి. వాటిలో అసలైన యాప్ ఏదో.. నకిలీ యాప్ ఏదో గుర్తించడం కష్టమే. ముఖ్యంగా ప్రభుత్వం అందించే వివిధ రకాల సేవల కోసం అనేకమంది యాప్‌లను ఆశ్రయిస్తుంటారు. అచ్చం అదేతరహా లోగోతో ఫేక్ యాప్స్ (Fake Apps) దర్శనమిస్తుంటాయి. పొరపాటున అది నకిలీదని గుర్తించకపోతే మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ తరహా ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫేక్ యాప్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. అందులోభాగంగా ప్రభుత్వ యాప్స్‌కు లేబుల్స్‌ను తీసుకురానుంది.
Google Layoffs: గూగుల్‌లో ఆగని లేఆఫ్స్, మరో 200 మంది ఉద్యోగులను తీసేసిన సెర్చ్ ఇంజిన్ దిగ్గజం
‘ఎక్స్’లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసేందుకు వీలుండడంతో.. ప్రభుత్వ ఖాతాలను (Government Apps) సులువుగా గుర్తించేందుకు ‘ఎక్స్’లో గ్రే టిక్ ఇచ్చారు. దీంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్నవారిని సులువుగా గుర్తించడం సాధ్యపడుతోంది. అచ్చం ఆ తరహాలోనే గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేబుల్‌ను తీసుకొచ్చింది. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లకు లేబుల్ దర్శనమివ్వనుంది. ఆ లేబుల్‌పై క్లిక్ చేస్తే ఒక పాప్-అప్ ఓపెన్ అయి ‘వెరిఫైడ్’ అని చూపుతుంది. ఇలా అసలైన యాప్‌ను నిర్ధారించుకోవచ్చు. సర్టిఫైడ్ యాప్‌ల కోసం బ్యాడ్జెలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం, డెవలపర్‌లతో కలసి పనిచేసినట్లు గూగుల్ తెలిపింది. భారత్‌తో పాటు, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, జపాన్, దక్షిణకొరియా, అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికోతో సహా 14 కంటే ఎక్కువ దేశాల్లో ఈ లేబుల్స్‌ను రోల్ అవుట్ చేశామని, త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మరోవైపు గూగుల్ డైలర్‌లో సంభాషణలకు సౌండ్ ఎఫెక్ట్‌లను జోడించే ‘ఆడియో ఎమోజీస్’ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్ రెడీ అవుతోంది. ఈ ఎమోజీలు క్లాపింగ్, లాఫింగ్, పార్టీ క్రయింగ్, పూప్, స్టింగ్.. ఇలా ఆరు రకాల విభిన్న శబ్దాలు చేస్తాయి. కాల్ మట్లాడే సమయంలో వీటిని ఎంచుకుంటే ఆ తరహా సౌండ్ ఎఫెక్ట్‌లు ఇద్దరికీ వినిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా బీటా టెస్టింగ్ దశలోనే ఉంది.