SMS App New Version: వాట్సప్‌ని సవాల్ చేయనున్న ఎసెమ్మెస్ యాప్, సరికొత్త హంగులతో ముందుకు, సెక్యూరిటీకి అత్యంత పెద్ద పీఠ, రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఆధారిత మెసేజింగ్ వ్యవస్థకు శ్రీకారం
SMS యాప్ లో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వాట్సప్ కు చెక్ పెడుతూ మెసేజింగ్ యాప్ కు పునర్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు తెర వెనుక ప్రారంభమయినట్లుగా తెలుస్తోంది.
October 28: ప్రస్తుతం ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు త్వరలో చెక్ పెట్టడానికి ఎసెమ్మెస్ మెసేజింగ్ యాప్ (SMS app) రెడీ అవుతోంది. SMS యాప్ లో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వాట్సప్ కు చెక్ పెడుతూ మెసేజింగ్ యాప్ కు పునర్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు తెర వెనుక ప్రారంభమయినట్లుగా తెలుస్తోంది. అమెరికాలో ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లు అయిన AT&T, స్ప్రింట్, టీ-మొబైల్, వెరిజాన్ సంస్థలు RCS (రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్) ఆధారిత మెసేజింగ్ వ్యవస్థ రూపకల్పనకు నడుం బిగించాయి. ఈ మెసేజింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మీరు మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా కూడా మెసేజ్ లను అందుకోవచ్చు.
దీనికి సంబంధించిన ప్రయత్నాలు అమెరికాలో కొంతకాలం క్రితమే ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ స్థాయిలో పరిణామాలేవీ జరగలేదు. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రధాన సర్వీస్ ప్రొవైడర్లు దీని కోసం చేతులు కలపడంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. అంతేకాకుండా దీనికి గూగుల్ కూడా తన వంతు సాయం చేస్తోంది. RCS ఆధారిత మెసేజింగ్ వ్యవస్థని వచ్చే ఏడాది నాటికి ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని వీరు తెలిపారు. ఒకవేళ ఈ మార్పు నిజంగా జరిగి మెసేజింగ్ యాప్ విజయవంతమైతే.. వినియోగదారుల మొగ్గు దీనివైపే ఉంటుందనే చెప్పుకోవచ్చు.