No Change in Income Tax Slabs: కొత్త ఆదాయపు పన్ను విధానంపై కేంద్రం క్లారిటీ, నేటి నుంచి ఎస్బీఐ డెబిట్ కార్డు చార్జీల మోత, ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి తప్పుదారిపట్టించే సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది.
No change in income tax slabs from April 1, 2024: మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం (Old Financial Year) కాల పరిమితి ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి తప్పుదారిపట్టించే సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. అందరూ తప్పకుండా కొత్త పన్ను స్లాబ్‌లనే పాటించాలని పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Union Finance Ministry) దృష్టికి వచ్చింది. ఈ మేరకు కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ పలు కీలకాంశాలను ‘ఎక్స్ (ట్విటర్)’లో పేర్కొంది. ఇందులో కొన్ని కీలకాంశాలను పేర్కొంది.
ఆర్థికశాఖ వివరాల ప్రకారం..పన్ను విధానంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మారేదీ ఏదీ లేదు. పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానాన్ని గతంలోనే ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్ (స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, ఫ్యామిలీ పెన్షన్ రూ.15,000 మినహా) కొత్త విధానంలో లేవు. మనుషుల చెవికి రెప్లికా సృష్టి.. పుట్టుకతోనే చెవి సరిగ్గా లేని వారికి ఉపయుక్తం
కొత్త పన్ను విధానం ఇక నుంచి డీఫాల్ట్‌గా వర్తించనుంది. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంత్సరానికి సంబంధించి రిటర్నులు ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక ఏడాదిలో కొత్త పన్ను విధానం, మరొక ఏడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.
కొత్త పన్ను విధానం 115 BAC (1A) ప్రకారం
రూ.3 లక్షల వరకు 0% పన్ను
రూ.3-6 లక్షల వరకు 5% పన్ను
రూ.6-9 లక్షల వరకు 10% పన్ను
రూ.9-12 లక్షల వరకు 15% పన్ను
రూ.12-15 లక్షల వరకు 20% పన్ను
రూ.15 లక్షలకు పైన 30% పన్ను
పాత పన్ను విధానం ప్రకారం
రూ. 2.5 లక్షల వరకు 0% పన్ను
రూ. 2.5 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను
రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను
రూ. 10 లక్షలకుపైన 30% పన్ను
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులు: ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ లాగిన్ తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ చార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఎన్పీఎస్ లాగిన్
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎన్పీఎస్ సిస్టమ్ లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) లోకి వెళ్లాల్సి ఉంటది. ఈ విషయమై 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది.
ఎస్బీఐ డెబిట్ కార్డు చార్జీల మోత
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు చార్జీలు పెంచేసింది. పెంచిన కొత్త చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెరిగింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది. పెరిగిన చార్జీలపై అదనంగా జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది.
మారిన క్రెడిట్ కార్డు వినియోగ నిబంధనలు..
ఇప్పటి వరకూ అద్దె చెల్లింపులపై రివార్డు పాయింట్లు అందిస్తున్న ఎస్బీఐ కార్డు ఇక నుంచి ఆ రివార్డులు ఇవ్వదు. అరూమ్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్ కార్డుల వాడకం దారులపై ప్రతికూల ప్రభావం ఉంటది. ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల యజమానులు ఇంతకుముందు త్రైమాసికంలో ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ అవుతుంది.
ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి.
ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి
ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేస్తారు. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్దతిలోనే అందించాల్సి ఉంటది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది.