Musk's Neuralink: ఇకపై అందరూ 'ఇస్మార్ట్'.. మానవ మెదడులో తొలిసారి ఎలక్ట్రానిక్ చిప్ అమరిక, న్యూరాలింక్‌పై కీలక ప్రకటన చేసిన ఎలన్ మస్క్
Musk's Neuralink: మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కొంతకాలం కిందట ఈ కాన్సెప్టుతో తెలుగులో 'ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా వచ్చింది. అందులో హీరో మెదడులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ అమరుస్తారు, దీంతో అతడు మరింత అడ్వాన్స్ పరిజ్ఞానం కనబరుస్తాడు, డబుల్ దిమాఖ్ తో ఆలోచిస్తూ పనులు పూర్తిచేస్తాడు. అయితే అది సినిమా కాగా, ఇప్పుడు నిజంగానే మనిషి మెదడులో చిప్ అమర్చడంలో ముందడుగుపడింది. ఈ ప్రాజెక్టును టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేపట్టడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే.. ఎలన్ మస్క్ నేతృత్వంలోని న్యూరాటెక్నాలజీ కంపెనీ 'న్యూరాలింక్' అనే మెదడు చిప్‌ను అభివృద్ధి చేసింది. తాజాగా ఈ న్యూరాలింక్ చిప్‌ను ఆదివారం నాడు తొలిసారిగా మనిషి మెదడులో విజయవంతంగా అమర్చినట్లు ఎలన్ మస్క్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ఆ చిప్ బాగా పనిచేస్తుందని, రోగి కూడా వేగంగా కోలుకుంటున్నాడని ఆయన వెల్లడించారు.
న్యూరాలింక్ చిప్ ఎలా పని చేస్తుంది?
న్యూరాటెక్నాలజీ రూపొందించిన మొదటి న్యూరాలింక్ (Neuralink) ఉత్పత్తిని టెలిపతి అని పిలుస్తారు. దీనిని మెదడులో అమర్చడం ద్వారా ఆలోచనలకు నియంత్రణ అందిస్తుంది. అంటే ఇది మీ బ్రెయిన్, కంప్యూటర్‌కు అనుసంధాన కర్తగా ఉంటుంది. తద్వారా కేవలం ఆలోచించడం ద్వారా ఆచరణను సాధ్యం చేస్తుంది. వివరింగా చెప్పాలంటే మీరు ఏదైనా చేయాలని ఆలోచిస్తే, మీ ఆలోచనల నుండే మీ కంప్యూటర్‌కు లేదా మీ స్మార్ట్ ఫోన్ కు కమాండ్ వెళ్తుంది, ఆ విధంగా మీరు అనుకున్నదే తడవుగా పని జరిగిపోతుంది. అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ ఈ చిప్ ద్వారా సాధ్యపడుతుందని ఎలన్ మస్క్ పేర్కొన్నాడు.
న్యూరాలింక్ ఎవరి కోసం ?
న్యూరాలింక్ అనేది ఎలోన్ మస్క్ 2017లో స్థాపించిన స్టార్టప్. ఇది మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ను (BCI) రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. పక్షవాతం, పార్కిన్సన్స్ వ్యాధి, మూర్ఛ మొదలైన బాధాకరమైన వ్యాధులతో పోరాడుతున్నవారు వారు తమ పనులను తాము చేసుకోవడానికి ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వ్యక్తులు కేవలం తమ ఆలోచనలను ఉపయోగించి మాత్రమే తమ ఫోన్‌లు, PCలను ఆపరేట్ చేయడంలో ఈ చిప్ సహాయపడుతుంది. ఇది వారి మెదడుల్లోకి ఎలక్ట్రోడ్‌లను అమర్చడంలో పని చేస్తోంది.
నిజానికి ఈ తరహా ప్రయోగాలు కొత్తేమి మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ప్రయోగాలకు ఇప్పటికే వివిధ దేశాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఎలన్ మస్క్ న్యూరాలింక్ స్టార్టప్ కూడా గతేడాదే US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుండి మొదటి మానవ ట్రయల్ నిర్వహించడానికి అనుమతి పొందింది, అనంతరం చిప్‌లను అమర్చడానికి వాలంటీర్లను కోరుతున్నట్లు ప్రకటించింది. మొదట జంతువులపై ఈ చిప్ అమర్చి, ఆ క్రమంలో మనిషి మెదడులో అమర్చడం మొదలుపెట్టింది. అయితే, ఈ తరహా ప్రయోగాలు వినాశనానికి దారితీస్తాయని విమర్శలు, ఆందోళనలు కూడా వెల్లువెత్తుతున్నాయి.