Chandrayaan 2: చంద్రుడి తొలి చిత్రాన్ని పంపించిన చంద్రయాణ్ 2. చంద్రునికి అతి సమీపంలోకి చేరుకున్న వ్యోమ నౌక. చంద్రయాణ్ 2 పంపిన తొలి ఫోటోను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్న ఇస్రో.
చిత్రంలో మరే ఓరియంటల్ బేసిన్ మరియు అపోలో క్రేటర్స్ గుర్తించబడ్డాయి...
Bengaluru, August 22: చంద్రయాణ్ 2 అంతరిక్ష నౌక చంద్ర కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత చంద్రుని మొదటి చిత్రాన్ని తీసింది. ఈ ఫోటో చంద్రుడి ఉపరితలానికి 2,650 కిలోమీటర్ల ఎత్తులో నుంచి క్యాప్చర్ చేయబడినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. చంద్రయాణ్ 2 ద్వారా తీయబడిన ఫోటోను గురువారం ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రుని పైన ఉండే మరే ఓరియంటల్ బేసిన్ ప్రాంతం మరియు అపోలో క్రేటర్స్ ప్రాంతాలు ఫోటోలో చూడొచ్చు.
"ఆగస్టు 21, 2019న చంద్రుడి ఉపరితలానికి సుమారు 2650 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రయాన్ 2, విక్రమ్ ల్యాండర్ క్యాప్చర్ చేసిన మొదటి మూన్ ఇమేజ్‌పై ఒక లుక్కేయండి. చిత్రంలో మరే ఓరియంటల్ బేసిన్ మరియు అపోలో క్రేటర్స్ గుర్తించబడ్డాయి " అని ఇస్రో ట్వీట్ చేసింది.
మంగళవారం రోజున చంద్ర కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ 2 వ్యోమ నౌక, సెప్టెంబర్ 7న చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ అయ్యే దిశగా సరైన మార్గంలో వెళ్తుందని ఇస్రో పేర్కొంది. ఆగస్టు 21 న, ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించి రెండవ చంద్ర బౌండ్ కక్ష్యలో ప్రవేశ పెట్టడాన్ని కూడా ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటివరకు ఈ మిషన్ లో ఎలాంటి లోపాలు తలెత్తలేదు, అంతా సవ్యంగానే సాగుతుందని ఇస్రో పేర్కొంది.
చంద్రుడిని సమీపించేలా మరలా ఆగష్టు 28, ఆగష్టు 30 మరియు సెప్టెంబర్ 1వ తేదీల్లో అంతరిక్ష కక్ష్యల్లో మార్పులు చేస్తూ, ఎత్తును తగ్గించే ప్రక్రియలు ఇస్రో చేపట్టనుంది. ఈ మూడు పూర్తయిన తర్వాత చంద్రుడిపై ల్యాండింగ్ రోజు, అనగా సెప్టెంబర్ 7 ఇస్రోకు అత్యంత కీలకం కానుంది.