
New Delhi, FEB 26: ఒక బాలుడికి పుట్టుక నుంచి నాలుగు కాళ్లు ఉన్నాయి. (Boy With 2 Extra Feet) సాధారణ కాళ్లతోపాటు పొట్ట వద్ద మరో రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో తోటి పిల్లల అవహేళనతో మధ్యలోనే చదువు మానేశాడు. చాలా ఏళ్లుగా మానసిక వేదన అనుభవించాడు. ఆ యువకుడికి ఎయిమ్స్ వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారు. పొట్ట వద్ద ఉన్న అదనపు కాళ్లను అరుదైన సర్జరీ ద్వారా తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాకు చెందిన 17 ఏళ్ల బాలుడు నాలుగు కాళ్లతో పుట్టాడు. పొట్ట భాగం వద్ద అదనంగా మరో రెండు కాళ్లు వేలాడుతున్నాయి. దీంతో చిన్నప్పటి నుంచి అవహేళనకు గురైన అతడు 8వ తరగతి నుంచి స్కూల్ మానేశాడు. శారీరక ఎదుగుదల లేకపోవడంతో మానసికంగా ఎంతో కుంగిపోయాడు.
కాగా, జనవరి 28న ఢిల్లీలోని ఎయిమ్స్ అవుట్ పేషెంట్ విభాగానికి ఆ యువకుడ్ని తీసుకువచ్చారు. అతడి కడుపు వద్ద వేలాడుతున్న అదనపు కాళ్లను డాక్టర్లు పరిశీలించారు. ఆ బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. అదనపు కాళ్లను తొలగించారు. వైద్యపరంగా ఒక ఘనత సాధించారు.
మరోవైపు ఇలాంటి సర్జరీ నిర్వహించడం ఎయిమ్స్‌లో తొలిసారి అని డాక్టర్ కృష్ణ తెలిపారు. రెండు అదనపు కాళ్ళు ఉండటం వల్ల ఆ యువకుడి శరీరం సరిగ్గా పెరగలేకపోయిందని తెలిపారు. దీనివల్ల ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. శారీరక సమస్యలతో పాటు మానసికంగా కుంగిపోయిన ఆ యువకుడికి అరుదైన సర్జరీ ద్వారా అదనపు కాళ్లను తొలగించినట్లు వెల్లడించారు.
వైద్యపరంగా ‘అసంపూర్ణ కవలలు’గా పిలిచే ఇలాంటి కేసు కోటి మందిలో ఒకరికి ఉంటుందని డాక్టర్ కృష్ణ తెలిపారు. గర్భంలోని కవలల్లో ఒకరి శరీరం అభివృద్ధి చెందకపోవడం, ఒకరి అవయవాలు మరో బిడ్డ శరీరానికి అతుక్కోవడం వల్ల ఇలా పుడతారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కాళ్లు ఉన్న వ్యక్తుల కేసులు 42 మాత్రమే నమోదయ్యాయని ఆయన వెల్లడించారు.