IPL Auction 2025 Live

ISRO Research on Moon: చంద్రయాన్ నుంచి చంద్రయాన్ 3 దాకా, చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు సాగాయి ఇలా..

చందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతంగా చంద్రుడు దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.

ISRO Research on Moon

చందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతంగా చంద్రుడు దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది. ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌.. చంద్రయాన్ 3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మూడు దశలను పూర్తి చేసుకున్న చంద్రయాన్‌-3 జాబిల్లి దిశగా ప్రయాణం ప్రారంభించింది.ఎల్‌వీఎం 3ఎం 4రా కెట్‌ నుంచి శాటిలైట్‌ విజయవంతంగా విడిపోయింది. 24 రోజులపాటు భూ కక్షలోనే చంద్రయాన్‌-3 ప్రదక్షిణ చేయనుంది.

వీడియో ఇదిగో, నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి చంద్రయాన్ 3, గురి తప్పొద్దనే పట్టుదలతో సకల జాగ్రత్తలు తీసుకున్న ఇస్రో

ఆ తర్వాత చంద్రుడి వైపు పయనించనుంది. 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.ఆగష్టు 23 లేదా 24 చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్‌ కానుంది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగుతుందని ఇస్రో వెల్లడించింది.

చంద్రునిపై చంద్రయాన్ -3 దిగబోయేది ఇక్కడే, 24 రోజులపాటు భూకక్ష్యలోనే ప్రయాణం, చంద్రయాన్ -3 మిషన్ హైలెట్స్ ఇవిగో..

చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్‌–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం.ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్‌ మాత్రం చంద్రయాన్‌–1 నుంచి తాజా చంద్రయాన్‌–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే చంద్రయాన్‌–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించనున్నారు.

చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఓ సారి పరిశీలిస్తే..

ఆగస్టు 15, 2003: అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ.. ‘చంద్రయాన్‌’ కార్యక్రమాన్ని ప్రకటించారు.

అక్టోబర్‌ 22, 2008: శ్రీహరికోటలోని ఇస్రో నుంచి చంద్రయాన్‌-1 ప్రయోగాన్ని ఇస్రో తొలిసారి చేపట్టింది.

నవంబర్‌ 8, 2008: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌-1 ప్రవేశించింది.

నవంబర్‌ 14, 2008: చంద్రయాన్‌-1 నుంచి బయటకు వచ్చిన పేలోడ్‌ (Moon impact probe).. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన చేపట్టింది. అనంతరం చంద్రుడి ఉపరితలంపై నీటి జాడ ఉన్నట్లు గుర్తించింది.

ఆగస్టు 28, 2009: చంద్రుని కక్ష్యలో తిరుగుతూ 312 రోజులపాటు పనిచేసిన చంద్రయాన్‌-1.. చంద్రుడి చుట్టూ మొత్తం 3400 సార్లు తిరిగింది. అనంతరం పరిశోధనా కేంద్రంతో కమ్యూనికేషన్‌ కోల్పోవడంతో చంద్రయాన్‌-1 ప్రయోగం ముగిసిపోయిందని ఇస్రో ప్రకటించింది.

జులై 22, 2019: చంద్రుడిపై అన్వేషణ కోసం ఇస్రో.. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది

ఆగస్టు 20, 2019: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ప్రవేశించింది.

సెప్టెంబర్‌ 2, 2019: చంద్రుడికి 100కి.మీ దూరంలో కక్ష్యలో ఆర్బిటార్‌ నుంచి విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌..చందమామపై అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే 2.1కి.మీ ఎత్తులో ఉండగానే గ్రౌండ్‌ స్టేషన్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది.

జులై 14, 2023: ఇస్రో ముచ్చటగా మూడోసారి చంద్రుడిపై పరిశోధనకు సిద్ధమైంది. జూలై 14న 2.35గంటలకు శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్‌-3 నింగిలోకి దూసుకెళ్లింది. 3.84లక్షల కి.మీ సుదీర్ఘ యాత్ర అనంతరం ఇది చంద్రుడి చెంతకు చేరనుంది.

ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌-3 రోవర్‌ సురక్షిత ల్యాండింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఇది సక్సెస్ అయితే ప్రపంచంలో చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా రోవర్‌ను ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత ఘనత సాధించనుంది.