Chandrayaan-3

చందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది. ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌.. చంద్రయాన్ 3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మూడు దశలను పూర్తి చేసుకున్న చంద్రయాన్‌-3 జాబిల్లి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

చంద్రయాన్‌-3 రాకెట్‌ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఎల్‌వీఎం 3ఎం 4రా కెట్‌ నుంచి శాటిలైట్‌ విజయవంతంగా విడిపోయింది. 24 రోజులపాటు భూ కక్షలోనే చంద్రయాన్‌-3 ప్రదక్షిణ చేయనుంది. ఆ తర్వాత చంద్రుడి వైపు పయనించనుంది. 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.ఆగష్టు 23 లేదా 24 చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్‌ కానుంది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగుతుందని ఇస్రో వెల్లడించింది.

హల్లో చందమామ, మీ దగ్గరకు వస్తున్నాం, హనుమంతుడు భారత జెండాతో చంద్రయాన్ 3 మిషన్ తీసుకువెళుతున్న ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్

చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్‌–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం.ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్‌ మాత్రం చంద్రయాన్‌–1 నుంచి తాజా చంద్రయాన్‌–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే చంద్రయాన్‌–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించనున్నారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు, చంద్రయాన్-3 ద్వారా భారతీయుల కలలు సాకారం చేసారంటూ ట్వీట్

ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్‌-3.. 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతారు.

తర్వాత చంద్రుడి దిశగా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్‌-3ని పంపిస్తారు. చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించాక లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ (ఎల్‌వోఐ) ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇంజిన్‌ను మండించి చంద్రయాన్‌-3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటినుంచి అది చందమామ కక్ష్యలో తిరుగుతుంది. అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు.

ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి.. ల్యాండర్‌, రోవర్‌తో కూడిన మాడ్యూల్‌ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్‌–3 బరువు 3,920 కిలోలు

► ఇందులో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ 2,145 కిలోలు, ల్యాండర్‌ 1,749 కిలోలు, రోవర్‌ 26 కిలోలుంటాయి.

► చంద్రయాన్‌–2 వైఫల్యంతో చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఆగిపోయాయి. చంద్రయాన్‌–2లో 14 పేలోడ్స్‌ పంపగా చంద్రయాన్‌–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే పంపుతున్నారు.

► చంద్రయాన్‌–3 ప్రపొల్షన్‌ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చి పంపుతున్నారు.

► ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు 2 నెలలుగా అహర్నిశలు శ్రమించారు.