'Code Red For Humanity': కోడ్ రెడ్..మానవాళికి పెను ముప్పు, ప్రపంచంపై విరుచుకుపడనున్న కార్చిచ్చులు, వడగాడ్పులు, భారత్‌లో కరువు కాటకాలు, తీరప్రాంతాల్లో కల్లోలం, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి-ఐపీసీసీ నివేదికలో వెల్లడి
ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని ఐరాస నివేదిక తాజాగా హెచ్చరించింది.
New Delhi, August 10: ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని ఐరాస నివేదిక తాజాగా హెచ్చరించింది. భూగోళం అత్యంత వేగంగా వేడెక్కుతోందని.. ఊహించిన దానికంటే తీవ్రంగా ఈ దుష్పరిణామం ఆందోళనకరంగా మారుతోందని వాతావరణ మార్పులపై (Intergovernmental Panel on Climate Change) ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ కమిటీ(ఐపీసీసీ) కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ పేరిట నివేదికలో హెచ్చరించింది.
మానవ తప్పిదాలతో జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం ఉష్ణోగ్రతలు, సముద్రాలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి, వేడిగాలులపై తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రభావంతో భారత్‌లో అతి వర్షాల కారణంగా భవిష్యత్‌లో వర్షపాతం భారీగా పెరుగుతుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను కట్టడి చేయకుంటే తరచూ ప్రకృతి వైపరీత్యాలు తథ్యమని హెచ్చరించింది. 234 మంది శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ నివేదికపై గత నెల 26 నుంచి రెండు వారాల పాటు 195 సభ్య దేశాల ప్రతినిధులతో వర్చువల్‌గా చర్చించిన ఐపీసీసీ.. సోమవారం 3 వేల పైచిలుకు పేజీల ‘సిక్స్త్ అసె్‌సమెంట్ రిపోర్ట్(ఏఆర్-6) క్లైమేట్ చేంజ్ 2021: ద ఫిజికల్ సైన్స్ బేసిస్’ నివేదికను విడుదల చేసింది.
గతంలో, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు, వాతావరణం, మార్పులపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాక ఈ నివేదికను విడుదల చేసినట్లు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. ఈ నివేదికను బట్టి.. వాతావరణ మార్పులు మానవాళి పాలిట ‘కోడ్ రెడ్’ (Code Red For Humanity) స్థాయికి చేరుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2013 నాటి ఏఆర్-5 నివేదిక తర్వాత.. ఊహించినదానికంటే ఎక్కువ వేగంగా భూతాపంపెరిగిపోతోందని ఐపీసీసీ చెబుతోంది. ఊహించినదానికంటే ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2013 నాటి నివేదిక ప్రకారం.. 2050 కల్లా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని భావిస్తే.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అది 2030లోగా జరగనుందని వివరించింది. ఇప్పటికే 1.1 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపింది
ధ్రువప్రాంతాల్లోని ‘శాశ్వత’ మంచుకొండలు కూడా కరిగిపోతున్నాయని, దీని వల్ల భవిష్యత్‌లో సముద్రమట్టాలు వేగంగా పెరుగుతాయని హెచ్చరించింది. ఇక భూతాపంతో ప్రకృతి వైపరీత్యాల్లోనూ వేగవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయని ఈ నివేదిక తెలిపింది. 1950 వరకు ప్రతి 50 ఏళ్లకు ఒకసారి వేడిగాల్పులు, అతి వర్షాలు ప్రతాపం చూపేవని గుర్తుచేసింది. ఆ తర్వాత అవి ప్రతి దశాబ్దానికి ఒకసారి వస్తున్నాయని, ఇప్పుడు దశాబ్దానికి 1.3 సార్లుగా మారిందని వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ప్రతి ఏడేళ్లలో రెండుసార్లు సంభవించే ప్రమాదముందని పేర్కొంది. వేడిగాలుల్లో పెరుగుదల ఉండగా.. చల్లగాలుల్లో తీవ్రస్థాయిలో తగ్గుదల నమోదవుతోందని తెలిపింది. సముద్ర మట్టాలు పెరిగి, తీర ప్రాంతాలు కోతకు గురవుతాయని చెప్పింది.
రాబోయే ప్రమాదం తప్పిపోవాలంటే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా రెండింతలు అధికంగా, వేగంగా కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిఉంటుందన్నారు. 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగత్రలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయిల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయి. అంటే ప్రపంచం ముప్పునకు చాలా దగ్గరగా ఉందని తెలుస్తోంది.
2015 పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు తూ.చ. తప్పకుండా అమలు చేయాలి. అందులో పేర్కొన్న ఐదు ప్రధానాంశాలపై దృష్టిసారించాలి. వీలైనంతగా కర్బన, మిథేన్, నైట్రస్ వంటి ఉద్గారాల విడుదలను తగ్గించాలి. ఉష్ణోగ్రత పెరుగుదలను 2030 కల్లా 1.5 డిగ్రీలలోపే పరిమితం చేస్తే.. మానవాళి మనుగడకు కొంత మేర ప్రమాదం తప్పుతుంది. గ్రీన్‌హౌస్ ఉద్గారాలలో కనిపిస్తున్న తరుగుదలను కొనసాగించాలి. అన్ని రకాల కాలుష్యాలను నియంత్రించాలి. పకడ్బందీ చర్యలు తీసుకుంటే.. 2040కల్లా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగే ప్రమాదాలు రెండింట మూడొంతులు ఉంటాయని, అయినా.. ఒకటింట మూడోవంతు ప్రపంచ దేశాల చేతుల్లో ఉంది. 2015 పారిస్ ఒప్పంద సమయంలో 100కు పైగా దేశాలు చేసిన ‘అనధికారిక’ ప్రతిజ్ఞల మాదిరిగా కాకుండా.. అత్యంత కష్టమైన సవాళ్లను ఎదుర్కోవాలని ఐపీసీసీ సూచించింది. కాగా, వాతావరణ మార్పులపై శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ ఐపీసీసీ. దీన్ని 1988లో ఐరాస పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ వాతావరణ సంస్థ సంయుక్తంగా నెలకొల్పాయి. వాతావరణ మార్పులపై ఈ సంస్థ అధ్యయనాలు చేపట్టి.. నివేదికలు ఇస్తుంది.
ప్రపంచ కర్బన ఉద్గారాలను కట్టడి చేసే విధానాన్ని బట్టి ఐదు రకాల భవిష్యత్ అంచనాలను నివేదిక ప్రస్తావించింది. 1. ఊహించనంత వేగంగా, భారీగా దేశాలు కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం. 2. తీవ్రమైన కాలుష్య నివారణ చర్యలుంటాయి కానీ భారీగా ఉండవు. 3. ఒక మోస్తరుగా ఉద్గారాల నియంత్రణ చేపట్టడం. 4. ప్రస్తుతమున్న స్వల్పకాలిక ప్రణాళికలను కొనసాగించడం. 5. కర్బన ఉద్గారాలు మరింతగా పెరగడం.. అనే ఐదు రకాల అంచనాలున్నాయని, ఇప్పటివరకు ప్రపంచం ఐదో మార్గంలో పయనిస్తూ వచ్చిందని, ఇటీవల కాలంలో మూడు, నాలుగు మార్గాలకు మధ్యస్థంగా ఉంటోందని నివేదిక వివరించింది. పైన చెప్పిన ఐదు మార్గాల్లో దేనిలోనైనా సరే 2030నాటికి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ టార్గెట్‌ను దాటటం ఖాయమని నివేదిక హెచ్చరించింది.
3,4 మార్గాలను అనుసరిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత అంచనాలను దాటి 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుందని, ఐదవ మార్గం కొనసాగితే 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత అంచనా కన్నా 3.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా పెరుగుతుందని తెలిపింది. కానీ దేశాల దృక్పథంలో వస్తున్న మార్పు వల్ల ఇంత ప్రమాదం జరగకపోవచ్చని నివేదిక అంచనా వేసింది. టిప్పింగ్ పాయింట్లుగా పిలిచే భారీ విధ్వంసాలైన మంచు చరియలు కరిగిపోవడం, సముద్ర ప్రవాహాల్లో అనూహ్య మందగమనం వంటివి జరిగేందుకు అవకాశాలు తక్కువే కానీ, అసలు జరగవని కొట్టిపారేయలేమని హెచ్చరించింది. అందరూ భయపడే అట్లాంటిక్ సముద్ర ప్రవాహాల మందగమనం ఈ శతాబ్దంలో ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే ఏమాత్రం పరిస్థితిని అశ్రద్ధ చేయకుండా అందరూ కర్బన ఉద్గారాల కట్టడికి, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది.
నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ఈ నివేదిక చర్చకు రానుంది. ఉద్గారాల తగ్గింపు విషయంలో తక్షణ చర్యల అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పిందని పలువురు ప్రపంచ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక గట్టి హెచ్చరికగా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ అభివరి్ణంచారు. మానవాళికి ఇది కోడ్ రెడ్ నివేదికని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ నేతలు ఇప్పటికైనా కనీసం ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గుటెరెస్ విజ్ఞప్తి చేశారు. నేతలంతా ఈ విషయంలో తప్పక చర్యలు తీసుకోవాలని స్కాటాండ్‌లో జరగబోయే సదస్సుకు అధ్యక్షత వహించనున్న అలోక్ శర్మ విజ్ఞప్తి చేశారు. మానవ జనిత కార్బన్‌డైఆక్సైడ్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని వందకు పైగా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.
భూ ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి వాయువులు ప్రచండంగా వీయడం, కరువు ఏర్పడడం, అనూహ్య వరదలు సంభవిస్తాయని నివేదిక పేర్కొంది. ఇటీవల కాలంలో శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులు చాలా వేగంగా, తీవ్రంగా, వెయ్యేళ్లలో లేనట్లుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు నిదర్శనాలను కళ్లముందుంచింది. భూతాపం కారణంగా జరిగే మార్పులతో భవిష్యత్‌లో అతి వర్షాల సంభవించి, భారత్‌లో వర్షపాతం పెరుగుతుందని ఐపీసీసీ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు చోటుచేసుకుంటాయని వివరించింది. సముద్ర మట్టం పెరగడం వంటి పరిణామాలు కూడా భారత్‌పై తీవ్ర ప్రభావాలు చూపిస్తాయని పేర్కొంది.
భారత్‌లో మొత్తం 7,517 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సముద్రం మట్టం పెరగడం వల్ల ఏర్పడే నేలకోత ప్రభావం ఓడరేవులున్న విశాఖపట్నం, చెన్నై, కోచి, కోల్‌కతా, ముంబై, సూరత్ నగరాలపై తీవ్రంగా పడనుంది. సముద్ర మట్టం ఒకవేళ 50 సెంటీమీటర్లు పెరిగినా.. ఈ ప్రాంతాల్లో సముద్రాలకు దగ్గరగా నివసించే 2.86 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతారు’’ అని ఈ నివేదికను తయారు చేసిన వారిలో ఒకరైన డాక్టర్ స్వప్న పనిక్కల్ వెల్లడించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)