IPL Auction 2025 Live

New York Earthquake: అమెరికాలో భూకంపం, భ‌యంలో ప‌రుగులు తీసిన‌ న్యూయార్క్, న్యూజెర్సీ ప్ర‌జ‌లు, రిక్ట‌ర్ స్కేల్ పై తీవ్ర‌త 4.8 గా న‌మోదు

ఈ ప్రాంతంలో భూకంపాలు అరుదని యూఎస్‌జీఎస్‌ పేర్కొంది.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

New Jersey, April 05: అమెరికా (USA)లో భూకంపం (Earthquake) సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు న్యూజెర్సీ (New Jersey)లో రిక్టర్‌ స్కేలుపై 4.8 తీవ్రతతో భూమి కంపించినట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. పొరుగున ఉన్న న్యూయార్క్‌ (New York)నూ ప్రకంపనలు తాకినట్లు తెలిపింది. న్యూజెర్సీలోని వైట్‌హౌస్‌ స్టేషన్‌కు 7 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 4.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో భూకంపాలు అరుదని యూఎస్‌జీఎస్‌ పేర్కొంది. ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. న్యూయార్క్‌లోని బ్రుక్లిన్‌లో భవనాలు కంపించాయని ఓ వార్తాసంస్థ పేర్కొంది.

 

న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో గాజా పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం కొనసాగుతుండగా ప్రకంపనలు రావడంతో.. తాత్కాలికంగా నిలిపేశారు. ‘‘ఇది భూకంపమా?’’ అని ఆ సమయంలో మాట్లాడుతున్న ‘సేవ్ ది చిల్డ్రన్’ ప్రతినిధి జాంటీ సోరిప్టో అన్నారు. బాల్టిమోర్‌, ఫిలడెల్ఫియా తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.