UK PM Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సోకిన కరోనావైరస్, 'మీరొక ఫైటర్‌.. మీరు దీనిని జయిస్తారు' అంటూ ధైర్యాన్ని నూరిపోసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

బ్రిటన్ ప్రధానికి ధైర్యాన్ని నూరిపోశారు."మీరొక ఫైటర్, తొందరలోనే మీరు ఈ వైరస్ ను జయిస్తారు. మీ ఆరోగ్యం బాగుండాలని, మీ ద్వారా మీ దేశ ప్రజలు.....

UK PM Boris Johnson and Indian PM Narendra Modi. | (File Photo)

New Delhi, March 28:  బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (UK PM Boris Johnson) కు వైద్య పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ (COVID-19 Positive) గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం మాట్లాడుతూ,  "గత 24 గంటలుగా తేలికపాటి లక్షణాలు కనిపించాయి, వైద్య పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో స్వీయ నిర్భంధాన్ని విధించుకున్నాను. అయినప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా పాలనను కొనసాగిస్తాను, అదే విధంగా వైరస్‌తో పోరాటం కూడా చేస్తాను. మనమంతా కలిసి ఈ వైరస్ ను ఓడించాలి. అందరూ ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి" అంటూ బ్రిటన్ ప్రధాని ట్వీట్ చేశారు.

బ్రిటన్ ప్రధానికి పాజిటివ్‌గా నిర్ధారించబడిన కొన్ని గంటలకే బ్రిటన్ ఆరోగ్య మంత్రి మరియు చీఫ్ హెల్త్ సెక్రెటరీ అయిన 41 ఏళ్ల మ్యాట్ హాంకాక్ (Matt Hancock) కు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. అయితే తనకు వ్యాధి లక్షణాలు చాలా తేలికగా ఉన్నాయని, ఏదిఏమైనా ఈ పరిస్థితి నుంచి ప్రజలను బయటపడేయటానికి తన ప్రయత్నం తాను చేస్తానంటూ మంత్రి మ్యాట్ హాంకాక్ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, అమెరికాలోనే అత్యధిక కేసులు

ఇక యూకే ప్రధానికి కరోనావైరస్ సోకడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోది స్పందించారు. బ్రిటన్ ప్రధానికి ధైర్యాన్ని నూరిపోశారు.

"మీరొక ఫైటర్, తొందరలోనే మీరు ఈ వైరస్‌ను జయిస్తారు. మీ ఆరోగ్యం బాగుండాలని, మీ ద్వారా మీ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. " అంటూ ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధానికి ట్వీట్ చేశారు.

Here's the tweet by PM Modi:

బ్రిటన్ దేశంలో శుక్రవారం నాటికి యూకేలో 14,543 కేసులు నమోదు కాగా, 759 మరణాలు సంభవించాయి. ఇప్పుడు ఏకంగా బ్రిటన్ దేశాధినేతకే వైరస్ సోకడంతో ఆ దేశ ప్రజలను ఆందోళనకు నెట్టింది. ఈ కేసుతో ప్రపంచంలో కోవిడ్-19కు గురైన తొలి నేతగా బ్రిటన్ ప్రధాని ఎవరూ కోరుకోని రికార్డులకెక్కాడు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వయసు ప్రస్తుతం 55 సంవత్సరాలు.