New Delhi, March 27: కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus Pandemic) భయాందోళనల నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించి శుక్రవారం నాటికి మూడు రోజులు కావొస్తున్నా దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 (COVID 19 in India) కేసుల సంఖ్య 724కు చేరింది. అలాగే మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, మొత్తం కేసులలో ప్రస్తుతం 662 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అత్యధిక కేసుల్లో కేరళ రాష్ట్రం మహారాష్ట్రను అధిగమించింది. కేరళలో (Kerala) 137 కేసులు నమోదు కాగా వీరిలో 11 మంది కోలుకున్నారు. ఇంతవరకు కేరళ నుంచి ఎలాంటి క్యాజువాలిటీలు నమోదు కాలేదు. మహారాష్ట్రలో (Maharashtra) కోవిడ్-19 కేసులు 130కి పెరిగాయి. వీరులో 15 మంది కోలుకోగా, 4 మరణాలు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 45, ఆంధ్రప్రదేశ్ లో 12 కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంది:
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Global Count) 532,230 దాటింది మరియు 24,078 కరోనా మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్యలో అమెరికా శుక్రవారం చైనాను అధిగమించింది. అమెరికాలో (Coronavirus in USA) 85,300 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది మరియు మృతుల సంఖ్య 1200 దాటింది, చైనాలో ఇప్పటివరకు 81,340 కేసులు నమోదు కాగా 3,292 మరణాలు సంభవించాయి. అయితే చైనా కేసుల సంఖ్య 75% తగ్గించుకుంది, కొత్త కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. పరిస్థితులు మెల్లమెల్లగా సాధారణ స్థితికి వస్తున్నాయి.
ఇటలీలో (Italy) పరిస్థితి ఘోరంగా ఉంది ఇప్పటివరకు ఇటలీలో 80,589 కేసులు నమోదు కాగా, కనీసం 8,215 మరణాలు సంభవించాయి. సుమారు 10 వేల మంది కోలుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్-19 నియంత్రణకు 'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఔషధం వాడవచ్చా?
స్పెయిన్‌లో (Spain) 56,347 కేసులు నమోదవగా, 4,154 మంది మరణించారు. జర్మనీలో 43,646 కేసులు నమోదు కాగా 262 మరణాలు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో కేసుల సంఖ్య 29,551 మరణాల సంఖ్య 1,696. ఇక ఇరాన్ దేశంలో 29,406 కేసులు నమోదు కాగా 2,234 మరణాలు సంభవించాయి.
కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కోవిడ్-19 తో దక్షిణ కొరియా (South Korea) ధీటుగా పోరాడుతుంది. కఠినమైన స్వీయ నియంత్రణ పాటిస్తూ, విస్తృతమైన పరీక్షలు నిర్వహిస్తున్న ద.కొరియాలో ఇప్పటివరకూ 9,241 కేసులు నమోదు కాగా, ఇందులో 4,144 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ దేశంలో ఇప్పటివరకు 131 మరణాలు సంభవించాయి.
స్వీయ నియంత్రణ, పాజిటివ్ కేసులను గుర్తించి వారికి చికిత్స చేయడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ విషయంలో ఇండియా ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.