Coronavirus infection | Image used for representational purpose (Photo Credits: Pixarby)

Hyderabad, March 24: ఎప్పట్నించో అందుబాటులో ఉన్న హైడ్రాక్సీక్లోరోక్విన్ (Hydroxychloroquine) అనే డ్రగ్ కు ఇప్పుడు ఇండియాలో ఎక్కడా లేని డిమాండ్ వచ్చి చేరింది. కారణం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సోమవారం నోవల్ కరోనావైరస్ వ్యాధికి విరుగుడుగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఉపయోగించమని సిఫారసు చేయడమే. కరోనావైరస్ సోకిన బాధితులకు మరియు వారి చికిత్సలో పాలుపంచుకునే వైద్య సిబ్బంది ఈ మెడిసిన్ ఉపయోగించవచ్చునని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ భార్గవ పేర్కొన్నారు.

గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ COVID-19పై చేసే పోరాటంలో హైడ్రాక్సీక్లోరోక్విన్-అజిథ్రోమైసిన్ డ్రగ్స్ కలయిక “గేమ్ ఛేంజర్” కావచ్చునని అన్నారు. దీంతో ఈ డ్రగ్ కు విశేషమైన ప్రాచుర్యం లభించింది. కోవిడ్ 19కు ఇప్పటికీ వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవచ్చా? అనే చర్చలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి.

హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా మలేరియా వైరల్ జ్వరం వచ్చినపుడు వైద్యులు ఇస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధుల చికిత్సలో కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఫార్ములా కలిగిన టాబ్లెట్స్ అందిస్తారు. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం ప్రకారం "ఆమోదించబడిన మోతాదులో" హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తీసుకోవడం ద్వారా SARS-CoV-2 సంక్రమణను నివారించవచ్చని, ఇది శరీరంలోని వైరస్ కణాలను తొలగించడంలో సహాయపడుతుందని వారి ప్రచురణలో పేర్కొన్నారు.

అయితే ఈ డ్రగ్ కోవిడ్-19 చికిత్సకు ఔషధమేనా? అంటే, అది ఇంకా క్లినికల్ ట్రయల్స్ లోనే ఉంది. కరోనావైరస్ సోకిన మరియు తేలికపాటి, మితమైన మరియు తీవ్రమైన COVID-19 లక్షణాలు ఉన్న వారిపై ఈ డ్రగ్ ప్రయోగిస్తే అది వారి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.  తెలంగాణలో 33, ఏపీలో 7 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, లాక్‌డౌన్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు

హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎవరు పడితే వారు తీసుకోవడం కుదరదని డాక్టర్లు చెబుతున్నారు. 'ప్రతిఒక్కరికీ క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వలేము, ఇది సమర్థంగా పనిచేస్తుందో, లేదో అన్నది ఇంకా తెలియరాలేదు, ఆరోగ్య సంక్షోభం తలెత్తిన సమయంలో మేము అందుబాటులో ఉన్న చికిత్స విధానాల కోసం ఇది ఒక ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉపయోగిస్తున్నాము. ప్రతిఒక్కరూ ఈ మెడిసిన్ తీసుకుంటే ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఈ ఔషధం పనితీరుపై మరిన్ని ఆధారాలు వెలువడాల్సి ఉంది' అని అపోలో వైద్యులు అన్నారు.

ఈ ఔషధాన్ని ఇష్టారీతిన వాడితే అది వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ తేవడంతో పాటు ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కరోనావైరస్ లక్షణాలపై అనుమానం ఉంటే నేరుగా ఎవరికి వారు ఈ మెడిసిన్ వేసుకోకుండా ముందుగా డాక్టర్ ను సంప్రదించాలి, ఆయన సూచించిన మోతాదు మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చేలా ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి.

అయితే ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం తీసుకున్నంత మాత్రాన వైరస్ నుంచి బయటపడినట్లు కాదు. ఇది వాడినా కూడా స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, నలుగురితో కలవకుండా ఉండటం, మొదలగు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.