Pan-India Lockdown: ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన, మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్, నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదని విజ్ఞప్తి, హెచ్చరిక
Modi addressing the nation | (Photo Credits: DD News)

New Delhi, March 24: మార్చి 24 రాత్రి 12 గంటల నుండి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ (nationwide lockdown) అమలులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించారు. 21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌కు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని, దీనిని కర్ఫ్యూగా పరిగణించాలని మోదీ పేర్కొన్నారు. "ఈరోజు అర్ధరాత్రి నుండి, దేశంలో ఏ ఒక్కరిని వారి ఇళ్ళలో నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించరు. ఇది మీ కోసం, ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడటం కోసమే" అని మోదీ అన్నారు. అయితే, నిత్యావసర వస్తువులతో సహా ఇంటికి అవసరమయ్యే అన్ని వస్తువుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారు.

భారత్ లో కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, పలు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాయి. మనమంతా స్వీయ నిర్బంధం పాటిస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సంక్లిష్ట సమయంలో అందరూ సహకరించాలని, సామాజిక దూరం పాటించడమే ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పరిష్కారమని ప్రధాని అన్నారు. దయచేసి ఈ 21 రోజులూ ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రావద్దని చేతులు జోడించి ప్రార్ధిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. మనకు మనమే లక్ష్మణ రేఖ గీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మణ రేఖను దాటి బయటకు రావద్దని కోరారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలకెవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయని, నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకువస్తాయని చెప్పారు. అలాగే ఎలాంటి వదంతులు నమ్మవద్దని చెప్పారు.

మరోవైపు, ఇండియా లాక్‌డౌన్‌లో భాగంగా మరోవైపు ఏమేమి తెరిచి ఉంటాయి, ఏమేమి మూసి ఉంటాయో కేంద్ర హోంశాఖ జాబితా విడుదల చేసింది.

ఇండియా లాక్‌డౌన్ సమయంలో తెరిచి ఉండేవి

 • కిరాణా షాపులు
 • పాల సరఫరా
 • పిడిఎస్ రేషన్ షాపులు
 • పండ్లు మరియు కూరగాయల అవుట్లెట్లు
 • మాంసం మరియు చేపల సరఫరా
 • పశుగ్రాసం
 • ఫైర్ బ్రిగేడ్ సేవలు
 • పోలీసు స్టేషన్లు
 • విద్యుత్, నీరు, పారిశుధ్య శాఖలు
 • బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఎటిఎంలు
 • ఫార్మాస్యూటికల్ (మెడికల్) స్టోర్స్
 • ఇంటర్నెట్ మరియు కేబుల్ సేవలు
 • ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా
 • అవసరమైన వస్తువుల ఇ కామర్స్ డెలివరీ
 • పెట్రోల్ పంపులు, సిఎన్‌జి పంపులు
 • సెక్యూరిటీస్ మార్కెట్
 • గిడ్డంగి, కోల్డ్ స్టోరేజ్ సర్వీసెస్
 • ప్రైవేట్ భద్రతా సేవలు

లాక్‌డౌన్ సమయంలో మూసివేయబడేవి

 • అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రభుత్వ, ప్రైవేటు రవాణా
 • పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా / శిక్షణా సంస్థలు
 • హోటళ్ళు, మోటల్స్ తప్ప ఆ హౌసింగ్ స్ట్రాండెడ్ ప్యాసింజర్స్
 • అవసరమైన వస్తువులను తయారుచేసేవారు మినహా అన్ని పారిశ్రామిక సంస్థలు
 • జిమ్‌లు, ఈత కొలనులు మరియు ఇతర సామాజిక సేకరణ కేంద్రాలు

ఈ రోజు మనం తీసుకునే చర్యలు రేపటి నాడు ఈ విపత్తు యొక్క ప్రభావాన్ని ఎంతమేరకు తగ్గించగలమో నిర్ణయిస్తుంది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వైద్య సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ నిధులు మంజూరు చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు.  కరోనా సంక్షోభంలో కలిగే నష్టాలపై  త్వరలోనే ఆర్థిక ప్యాకేజీ, కీలక ప్రకటనలు చేసిన నిర్మలా సీతారామన్

దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఉపయోగించి పరీక్షా సదుపాయాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఐసోలేషన్ వార్డులు, ఐసీయూ పడకలు మరియు మరిన్ని నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రధానమంత్రి పేర్కొన్నారు.