Cameroon Cough Syrup Deaths: దగ్గుమందుతో 12 మంది చిన్న పిల్లలు మృతి, ఆ మందు భారత్‌లో తయారైందని అనుమానాలు వ్యక్తం చేసిన కామెరూన్
కామెరూన్‌లో 12 మంది చిన్నారుల మరణాలకు (Cameroon Cough Syrup Deaths) భారత్ లో తయారైన దగ్గుమందే కారణమని అక్కడి అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
కామెరూన్‌లో 12 మంది చిన్నారుల మరణాలకు (Cameroon Cough Syrup Deaths) భారత్ లో తయారైన దగ్గుమందే కారణమని అక్కడి అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఈ దగ్గుమందు తయారీ లైసెన్స్ నంబరు.. భారత్‌కు చెందిన ఓ సంస్థతో సరిపోలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల జాతీయ మీడియా కథనం వెల్లడించింది. కామెరూన్‌లో కొన్ని రోజులుగా చిన్నారులు మృతిచెందుతున్నారు.
ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు (Cough Syrup Suspected Of Killing 12 Kids) కోల్పోయారు. వీరి మరణానికి నేచర్‌కోల్డ్ అనే దగ్గుమందు కారణమని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. దగ్గుమందు ఫొటోలను కామెరూన్ విడుదల చేసింది. ఆ ఔషధ తయారీ లైసెన్స్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రీమన్ ల్యాబ్స్‌కు కూడా ఉన్నట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. దీంతో ఈ ఔషధం భారత్‌లోనే తయారై ఉంటుందని అనుమానిస్తున్నారు.
దీనిపై రీమన్ డైరెక్టర్ నవీన్ భాటియా స్పందించారు. అది తమ సంస్థ తయారు చేసిన ఔషధం లాగే కన్పిస్తోందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మధ్యప్రదేశ్ ఆహార, ఔషధ విభాగ అధికారులు మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.