COVID in China: కోవిడ్ కల్లోలంలో చైనా సంచలన నిర్ణయం, జనవరి 8 నుంచి అంతర్జాతీయ రాకపోకలకు గ్రీన్ సిగ్నల్, కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపిస్తే చాలంటున్న డ్రాగన్ కంట్రీ
అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలను తొలగించాలని తాజాగా నిర్ణయించింది. జనవరి 8 నుంచి చైనాకు అంతర్జాతీయ రాకపోకలపై ఉన్న నిబంధనలను ఎత్తేస్తున్నట్టు నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది.
Beijing, Dec 28: కరోనా కేసులతో చైనా ప్రజలు విలవిలలాడుతుంటే చైనా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలను తొలగించాలని తాజాగా నిర్ణయించింది. జనవరి 8 నుంచి చైనాకు అంతర్జాతీయ రాకపోకలపై ఉన్న నిబంధనలను ఎత్తేస్తున్నట్టు నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. చైనాకు వచ్చే వారు ఇకపై కేవలం కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపిస్తే సరిపోతుంది.
ఇన్ని రోజులు కరోనా వ్యాప్తి అడ్డుకట్టపై దృష్టి పెట్టిన చైనా..ఇప్పుడు దాని కంటే బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించటంపైనే దృష్టి పెట్టింది. రిటైర్డ్ వైద్యులు, సిబ్బందిని కూడా విధుల్లోకి తీసుకొంటున్నది. ఇంతకాలం సగటున 10 వేల మందికి 4 ఐసీయూ బెడ్లు ఉంటే నెలలో 10కు పెంచింది.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడేళ్లుగా అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనను కూడా పూర్తిగా ఎత్తేయనుంది.
కరోనాను డెంగీ తదితర జ్వరాలతో సమానమైన బి కేటగిరీకి తగ్గిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య వెల్లడిని కూడా ఆదివారం నుంచి చైనా ఆపేయడం తెలిసిందే.