Beijing, Dec 28: చైనాలో కరోనావైరస్ విజృంభణ (Covid in China) కొనసాగుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక నగరం జిజెయాంగ్‌లో రోజుకు కనీసం 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇవి రోజుకు పాతిక లక్షలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇక మార్చురీల బయట శవాలు గుట్టలుగా పేరుకుంటున్న వీడియోలు బయటకు వస్తున్నాయి.
చాలాచోట్ల కనీసం 10 రోజులకు పైగా వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ వైరస్ గురించి మనదేశంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కే అరోరా (Centre's Covid panelchief NK Arora) వెల్లడించారు. చైనా నుంచి సరైన సమాచారం లేనందున.. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. చైనాలో కోవిడ్ వ్యాప్తికి ఒకటి కాదు నాలుగు వేరియంట్లు (Not One, 4 Virus Variants) కారణమని పేర్కొన్నారు. చైనా దేశంలో మహమ్మారి విలయానికి వైరస్‌ల కాక్టెయిల్ కారణమని స్పష్టంగా తెలుస్తోందన్నారు.
ఈ మేరకు ఆయన ప్రముఖ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ.. బీఎఫ్.7 వేరియంట్ కేసులు కేవలం 15 శాతం మాత్రమే నమోదవుతున్నాయని.. అత్యధికంగా 50 శాతం కేసులు బీఎన్, బీక్యూ వేరియంట్ ద్వారా వ్యాపిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ఎస్‌వీవీ వేరియంట్ నుంచి మరో 15 శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. దీంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు.
కోవిడ్ మొదటి, రెండు, మూడో వేవ్‌ల నుంచి వ్యాక్సిన్లు, ఇన్‌ఫెక్షన్‌ల ద్వారా భారతీయులకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ లభించిందని తెలిపారు. దీని కారణంగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చైనాతో పోల్చుకుంటే భారత్ లో 97 శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని ఆరోరా తెలిపారు. మిగిలిన వారు ఒకటి కంటే ఎక్కువసార్లు కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు.
చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్.. మరణాలపై అందని సమాచారం.. వీడియోతో
ఇక పిల్లల విషయానికొస్తే 12 ఏళ్ల లోపు చిన్నారులు 96 శాతం మంది ఒక్కసారి వైరస్ బారిన పడినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో కూడా చాలా మందికి కోవిడ్ సోకిందని... వీటన్నింటిని చూస్తే మహమ్మారి నుంచి మనం చాలా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అయితే కేసుల విషయంలో చైనా నుంచి అస్పష్టమైన సమాచారం ఉండటం వల్ల జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉండగా చైనాలో కేసులు పెరిగిపోతుంటే.. మరోవైపు వాటి కట్టడి ప్రయత్నాలను, నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తూ చైనా ప్రభుత్వం హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను పూర్తిగా తెరవాలని నిర్ణయించింది. అంతేగాక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడేళ్లుగా అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనను కూడా పూర్తిగా ఎత్తేయనుంది.
ఇవన్నీ జనవరి 8 నుంచి అమల్లోకి వస్తాని ప్రకటించింది. చైనాకు వచ్చే వారు ఇకపై కేవలం కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపిస్తే సరిపోతుంది. ఇందుకు వీలుగా కరోనాను డెంగీ తదితర జ్వరాలతో సమానమైన బి కేటగిరీకి తగ్గిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య వెల్లడిని కూడా ఆదివారం నుంచి చైనా ఆపేయడం తెలిసిందే.