Omicron Subvariants: మళ్లీ రెండు కొత్త వేరియంట్లు, దక్షిణాఫ్రికాలో బీఏ.4, బీఏ.5 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించిన అధికారులు, కొన్ని దేశాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు
అనేక దేశాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్లు (Omicron Subvariants) పుట్టుకొచ్చాయి.
Mumbai, April 13: ఒమిక్రాన్ ఇప్పట్లో అంతమయ్యే సూచనలు కనపడట్లేదు. అనేక దేశాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్లు (Omicron Subvariants) పుట్టుకొచ్చాయి. దక్షిణాఫ్రికాలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లను (BA.4 and BA.5) పరిశోధకులు గుర్తించారు. అలాగే ఆ వేరియంట్లకు సంబంధించి మరి కొన్ని దేశాల్లోనూ ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోన్న బీఏ.2 వేరియంట్‌లాగే బీఏ.4, బీఏ5 స్పైక్ ప్రొఫైల్‌ను కలిగి ఉన్నాయని దక్షిణాఫ్రికా పరిశోధకులు చెప్పారు. దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన ఆ వేరియంట్లు ( new Omicron subvariants) ఇప్పటికే బోట్స్‌వానా, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌తో, బ్రిటన్‌లోనూ వ్యాప్తి చెందాయని వివరించారు. దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్ల కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ వాటి వల్ల ఆసుపత్రుల్లో చేరడం, మృతి చెందడం వంటి కేసులు అంతగా లేవని, ఈ వేరియంట్లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
బీఏ.4, బీఏ5లోని స్పైక్ ప్రొటీన్ డెల్టా, కప్పా, ఎప్సిలాన్ వేరియంట్లలో ఉన్నదేనని తెలిపారు. ఆ వేరియంట్లు రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోగలవా? అన్న విషయంపై పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. ఈ వేరియంట్లు నిర్ధారణ అయిన బాధితులందరూ ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
అలాగే, ఇప్పటికే భారత్‌లో బయటపడిన 'ఎక్స్‌ఈ' వేరియంట్‌పై కూడా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో పాటు కేసులపై నిఘా పెంచాలని చెప్పారు. కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాల లభ్యతపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 50కోట్ల మార్క్‌ను దాటింది. తొలి కేసు నమోదైన రోజు నుంచి 877 రోజుల తర్వాత 50 కోట్లకు పెరిగాయి. ఇందులో 44.88కోట్ల మంది కోలుకోవడం కాస్త ఊరట కలిగించే విషయం. మరో ఆందోళనకరమైన విషయమేంటంటే మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 62లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలను వరల్డ్‌మీటర్.ఇన్ఫో (worldometers.info/coronavirus) విడుదల చేసింది.