Omicron in South Africa: ఒమిక్రాన్ వేరియంట్‌తో మాకు ఇబ్బందేం లేదన్న సౌతాఫ్రికా అధ్యక్షుడు, కేసులు రెట్టింపయినా నో ప్రాబ్లమంటున్న రమఫోసా
కొత్త వేరియంట్ వల్ల ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని అన్నారు సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(Cyril Ramaphosa).
South Africa December 06: కరోనా కొత్త వేరియంట్ (New Variant) ఒక పక్క ప్రపంచదేశాలను వణికిస్తుంటే ఒమిక్రాన్ (Omicron) మొదటవెలుగు చూసిన దక్షిణాఫ్రికా(South Africa) అధ్యక్షుడు మాత్రం కూల్ గా ఉన్నారు. కొత్త వేరియంట్ వల్ల ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని అన్నారు సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(Cyril Ramaphosa). ఒమిక్రాన్ వల్ల ఆందోళనకర పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపించట్లేదన్నారు. దక్షిణాఫ్రికా పౌరుల ప్రయాణాలపై వివిధ దేశాలు ఆంక్షలు విధించడాన్ని రమఫోసా(Cyril Ramaphosa) తప్పుబట్టారు.
కొత్త వేరియంట్ వ్యాప్తి అవకాశాలపై పరిశోధనలు జరుపాల్సి ఉందన్నారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు. ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాపిస్తున్నా ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా(Joe Phaahla) చెప్పారు. దవాఖానల్లో చేరిన వారిలో వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయన్నారు.
దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్(Omicron) కేసులు వెలుగు చూసినప్పటి నుంచి అక్కడ యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ బయటపడే నాటికి దక్షిణాఫ్రికాలో 19 వేల యాక్టివ్ కేసులు ఉంటే, గత నెలాఖరు నాటికి 75 వేలకు పెరిగింది. దీని వ్యాప్తి రేటు ఎక్కువ ఉన్నందున దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకర వేరియంట్ అని ప్రకటించింది.