Titanic Tourist Submarine Operation: టైటాన్ కథ విషాదాంతం.. సబ్‌మెరైన్‌లోని ఐదుగురు మృతి.. టైటానిక్ శిథిలాల పక్కనే, తప్పిపోయిన జలాంతర్గామి గుర్తింపు
సబ్‌మెరైన్ (Submarine) లోని ఐదుగురు పర్యాటకులు మరణించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ (America Coast Guard) ప్రకటించింది.
Newdelhi, June 23: అట్లాంటిక్ మహాసముద్రంలో (Atlantic Ocean) అదృశ్యమైన టైటాన్ సబ్‌మెరైన్ (Titan Submarine) కథ విషాదాంతమైంది. సబ్‌మెరైన్ (Submarine) లోని ఐదుగురు పర్యాటకులు మరణించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ (America Coast Guard) ప్రకటించింది. టైటానిక్ (Titanic) నౌక శకలాలను చూసేందుకు వెళ్లి టైటాన్ మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో టైటాన్ పేలిపోయిందని.. దీంతో ఇందులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని యూఎస్ కోస్ట్ గార్డు తెలిపింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో టైటాన్ శకలాలను గుర్తించామని.. టైటానిక్ షిప్ శిథిలాల పక్కనే సబ్‌మెరైన్ శిథిలాలు కనిపించాయని పేర్కొంది. టైటానిక్ ఓడకు 488 మీటర్ల దూరంలో టైటాన్ సబ్‌మెరైన్ శకలాలు కనిపించాయని తెలిపింది.
అసలేం జరిగింది?
టైటానిక్ శిథిలాలను చూసేందుకు టైటాన్ మినీ జలాంతర్గామిలో ఐదుగురు పర్యాటకుల బృందం వెళ్లింది. ఈ బృందంలో బ్రిటీష్-పాకిస్థానీ బిలియనీర్ ప్రిన్స్ దావూద్ (48), ఆయన కొడుకు సులైమాన్ (19), బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ టూరిస్ట్ పాల్ హెన్రీ నర్జియోలెట్, ఓసింగేట్ సీఈఓ స్టాక్‌టన్ రష్ ఉన్నారు. టైటానిక్ శిథిలాలు అట్లాంటిక్ మహా సముద్రంలో కేప్ కాడ్‌కు తూర్పున 1,450 కిలోమీటర్లు, న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్‌కు దక్షిణంగా 644 కిలోమీటర్ల దూరంలో 12 వేల అడుగుల లోతులో ఉన్నాయి. వీటిని చూసేందుకు ఈ ఐదుగురు మినీ జలాంతర్గామిలో గత ఆదివారం ఉదయం బయలుదేరారు. అక్కడికి చేరుకోవడానికి 8 గంటల ప్రయాణం పడుతుంది. అయితే గత మూడు రోజులుగా టైటాన్ సబ్‌మెరైన్ ఆచూకీ గల్లంతైంది.
ఆపరేషన్ ఇలా..
మినీ జలాంతర్గామిని గుర్తించేందుకు కెనడా, అమెరికా కోస్ట్ గార్డు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సబ్‌మెరైన్‌లో ఆక్సిజన్ నిల్వలు 96 గంటలకు సరిపడా ఉండడంతో ముమ్మరంగా గాలించారు. క్షణక్షణం ఉత్కంఠ రేపగా.. చివరకు విషాదాన్ని మిగిల్చింది. గురువారం సాయంత్రం మినీ జలాంతర్గామి శకలాలను అమెరికా కోస్ట్ గార్డ్ గుర్తించారు. ఐదుగురి మరణాన్ని ధృవీకరించారు.