Hawaii Wildfire: అమెరికా హవాయి ద్వీపంలో అడవుల్లో చెలరేగిన మంటలు, 36 మంది అగ్నికి ఆహుతి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ద్వీపాన్ని దాటుతున్న ప్రజలు
అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
Wailuku, August 10: యుఎస్ లోని హవాయి (Hawaii) ద్వీపంలో అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మంటలు, పొగ ధాటికి తట్టుకోలేక పలువురు సముద్రంలోకి (Ocean) దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఈ కార్చిచ్చు వ్యాపిస్తున్నట్లు మౌయి కౌంటీ (Maui County) వెల్లడించింది. కార్చిచ్చుకు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్‌లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలి బూడిదైనట్లు చెప్పారు.
Here's Videos
కార్చిచ్చు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హవాయి ద్వీపంలో ఇప్పటికే అత్యవసర ప్రతిస్పందనా బృందాలు సహాయక చర్యలు చేపడుతుండగా ఆర్మీ, నేవీ కూడా రంగంలోకి దిగాలని బైడెన్ ఆదేశించారు. మరోవైపు నివాసితులంతా తరలింపు ఆదేశాలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.