Jasprit Bumrah’s Masterclass Helps India Edge Out Pakistan by Six Runs

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో ఆదివారం జరిగిన అత్యంత ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత్ చేతిలో పాక్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టుకు టోర్నీలో వరుసగా రెండవ ఓటమి ఎదురైంది.టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసి 119 పరుగులకే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. ఆ తర్వాత బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి గెలుపును సొంతం చేసుకుంది.

120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు అద్భుతంగా చెలరేగడంతో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 3 కీలక వికెట్లతో చెలరేగిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.  పాకిస్థాన్ పై ఇండియా రికార్డుల మోత‌! ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పై భార‌త్ కు ఉన్న తిరుగులేని రికార్డులివే..

120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు ఆది నుంచి ఆచితూచి బ్యాటింగ్ చేశారు. పరుగులు తక్కువగానే ఉన్నప్పటికీ వికెట్లు కోల్పోకుండా ఆడారు. 11.5 ఓవర్లలో 71/2 స్కోర్‌తో పాకిస్థాన్ పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. మ్యాచ్ ప్రిడిక్షన్ ప్రకారం గెలుపు అవకాశాలు భారత్‌కు 8 శాతం, పాకిస్థాన్‌కు 92 శాతంగా ఉన్నాయి. దీంతో పాక్ గెలుపు ఇక సునాయాసమేనని అనిపించింది. కానీ భారత బౌలర్లు పట్టు వదలకుండా ఆత్మవిశ్వాసంతో ఆడారు. కీలక సమయంలో వికెట్లు తీసి.. పరుగులు నియంత్రించి మ్యాచ్ విజయం కోసం రేసులోకి వచ్చారు. చివరకు ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకున్నారు.

భారత బౌలర్లలో బుమ్రాతో పాటు మిగతా బౌలర్లు కూడా అదరగొట్టారు. ముఖ్యంగా 4 ఓవర్లు వేసిన హార్ధిక్ పాండ్యా 24 పరుగులు మాత్రమే చేసి కీలక దశలో 2 ముఖ్యమైన వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. 31 పరుగులు చేసిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫకర్ జమాన్ 13, ఇమాద్ వసీమ్ 15, షాదాబ్ ఖాన్ 4, ఇఫ్తీకర్ అహ్మద్ 5, షాహీన్ ఆఫ్రిదీ 0 (నాటౌట్), నషీమ్ షా 10(నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఓడిపోవడంతో మ్యాచ్ ముగిసే సమయానికి క్రీజులో ఉన్న నషీమ్ షా కన్నీళ్లు పెట్టాడు. విలపిస్తూ మైదానాన్ని వీడాడు. మిగతా పాక్ ఆటగాళ్లు కూడా షాక్‌కు గురవడం కనిపించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లు మాత్రమే ఆడి 119 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. 42 పరుగులు చేసిన రిషబ్ పంత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో అక్షర్ పటేల్ 20, కెప్టెన్ రోహిత్ శర్మ 13, కోహ్లీ 4, సూర్యకుమార్ యాదవ్ 7, శివమ్ దూబే 3, హార్దిక్ పాండ్యా 7, రవీంద్ర జడేజా 0, అర్షదీప్ సింగ్ 9, బుమ్రా 0, సిరాజ్ 7 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 3, హరీస్ రౌఫ్ 3, మహ్మద్ అమీర్ 2, షహీన్ అఫ్రిది 1 వికెట్ తీశారు.

పాకిస్తాన్ ప్లే అప్ అవకాశాలు అంతంత మాత్రమే..

తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్ తో సంచలనాత్మక రీతిలో దాయాది దేశం ఓడిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో ఆ జట్టు సూపర్-8 దశ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. పాక్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకపోవడంతో ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేదు. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సూపర్-8 రేసులో సమీకరణాలు పాక్ కు అనుకూలంగా మారాలంటే.. దాయాది దేశం మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. కెనడా, ఐర్లాండ్‌లపై విజయాలు సాధించాలి. ఇదే సమయంలో అమెరికా, కెనడా జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి.

ఒకవేళ పాకిస్థాన్ మిగిలిన 2 మ్యాచ్‌ల్లో గెలిచి.. అమెరికా మిగిలిన 2 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైతే రెండు జట్లు చెరో 4 పాయింట్లతో సూపర్-8 రేసులో నిలుస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్టు అర్హతను నిర్ణయిస్తారు. మొత్తంగా చూస్తే భారత్ చేతిలో ఓడిపోయాక పాకిస్థాన్ సూపర్-8 అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారాయి.

పలు రికార్డులు బద్దలు

దీంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌‌లో పలు రికార్డులను నెలకొల్పింది.టీ20 వరల్డ్ కప్‌లలో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. తాజా గెలుపుతో కలుపుకొని పాకిస్థాన్‌పై భారత్ ఇప్పటివరకు ఏకంగా 7 సార్లు గెలిచింది. ఒక టై మ్యాచ్‌ విజయంతో కలుపుకొని ఈ రికార్డును భారత్ సొంతం చేసుకుంది. ఈ జాబితాలో పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. టీ20 వరల్డ్ కప్‌లలో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ 6 విజయాలు సాధించింది. శ్రీలంక కూడా వెస్టిండీస్‌పై 6 విజయాలు సాధించి సమాన స్థితిలో నిలిచింది.

పాకిస్థాన్‌పై అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా భారత్ నిలిచింది. 2021లో పాక్‌పై జింబాబ్వే 119 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోగా తిరిగి భారత్ ఇప్పుడు అదే స్కోరును అద్భుతంగా డిఫెండ్ చేసుకోగలిగింది. ఇక 2010లో పాక్‌పై 128 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా విజయవంతంగా కాపాడుకుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ 130, జింబాబ్వే 131 పరుగుల లక్ష్యాలను డిఫెండ్ చేసుకున్నాయి.

టీ20 వరల్డ్ కప్‌లలో డిఫెండ్ చేసుకున్న అత్యల్ప లక్ష్యాలు..

1. న్యూజిలాండ్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న శ్రీలంక (2014)

2. పాకిస్థాన్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకున్న భారత్ (2024)

3. వెస్టిండీస్‌పై 124 పరుగుల టార్గెట్‌ను కాపాడుకున్న ఆఫ్ఘనిస్థాన్ (2016)

4. ఇండియాపై 127 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకున్న న్యూజిలాండ్ (2016)

5. న్యూజిలాండ్‌పై 129 పరుగుల టార్గెట్‌ను కాపాడుకున్న దక్షిణాఫ్రికా (2009)

టీ20లో భారత్‌‌ కాపాడుకున్న అత్యల్ప లక్ష్యాలు..

1. పాకిస్థాన్‌పై 120 పరుగుల టార్గెట్ (2024)

2. జింబాబ్వేపై 139 పరుగుల లక్ష్యం (2016)

3. ఇంగ్లండ్‌పై 145 పరుగుల లక్ష్యం (2017)

4. బంగ్లాదేశ్‌పై 147 పరుగుల టార్గెట్ (2016).