New York, June 09: ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్‌లో అసలుసిసలైన సమరానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ స్టేడియం వేదికగా భారత్(India), పాకిస్థాన్(Pakistan) జట్లు అమీతుమీకి సిద్దమయ్యాయి. ప్రపంచమంతా కళ్లగ్పగించి చూసే ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్ ఎవరు? బంతితో చెలరేగే స్పీడ్‌స్టర్ ఎవరు? అని ఊహాగానాలు జోరందుకున్నాయి. గత రికార్డులు పరిశీలిస్తే.. పొట్టి వరల్డ్ కప్ చరిత్రలో పాక్‌పై (IND Vs PAK) భారత స్టార్ ఆటగాళ్లు అదరగొట్టారు. చిరకాల ప్రత్యర్థితో గేమ్ అంటేనే రెచ్చిపోయే విరాట్ కోహ్లీ(Virat Kohli).. రెండేండ్ల క్రితం సిడ్నీలో వీరోచిత హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించడం ఇప్పట్లో మర్చిపోలేం. ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ జోడీ పాక్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తే.. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్‌లు దాయాది పేసర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మాజీ కెప్టెన్ విరాట్‌కు చిరకాల ప్రత్యర్థిపై ఘనమైన రికార్డు ఉంది. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతడు 132.75 స్ట్రయిక్ రేటుతో 306 రన్స్ సాధించాడు. భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ న్యూయార్క్‌లో మరోసారి టీమిండియా గెలుపు గుర్రమవుతాడా? లేదా? చూడాలి.
ప్రస్తుత భారత సారథి రోహిత్ శర్మ(Rohit Sharma)కు పాక్‌పై గొప్ప ఆడిన సందర్భాలు తక్కువే. దాయాదిపై 10 ఇన్నింగ్స్‌ల్లో హిట్‌మ్యాన్ 118.75 స్ట్రయిక్ రేటుతో 114 రన్స్ సాధించాడు. కెరీర్‌లో చివరి పొట్టి ప్రపంచ కప్ ఆడుతున్న రోహిత్.. షాహీన్ ఆఫ్రిది, మహ్మద్ అమిర్, నసీం షా, హ్యారిస్ రవుఫ్‌లతో కూడిన పాక్ పేస్ దళాన్ని చితకబాదితే టీమిండియాకు శుభారంభం దక్కినట్టే. అయితే.. స్వల్ప స్కోర్లు నమోదవుతున్న న్యూయార్క్‌లో భారత్, పాక్ బౌలర్లలో ఎవరు ఇరగదీస్తారు? అనేది చూడాలి. రాత్రి 8 గంటలకు జరుగబోయే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.