Indian Flag Shines High: విదేశీ గడ్డపై ఠీవీగా మెరిసిన భారత జెండా. స్విట్జర్లాండ్‌లోని మాటర్‌హార్న్ పర్వతంపై త్రివర్ణ పతాక కాంతులు, కోవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటానికి సంఘీభావం, మానవత్వం గెలుస్తుందన్న నరేంద్ర మోదీ
COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి, భారతీయులకు సంఘీభావం తెలిపే సూచికగా....
Geneva, April 18: స్విట్జర్లాండ్‌లోని ప్రఖ్యాత మాటర్‌హార్న్ పర్వతం భారత జెండాలోని త్రివర్ణ కాంతులతో వెలిగిపోయింది. COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి, భారతీయులకు సంఘీభావం తెలిపే సూచికగా జెర్మాట్‌లోని మాటర్‌హార్న్ పర్వతంపై భారత జెండాను ప్రకాశింపజేశారు. లాక్ డౌన్ కాలంలో ఎంతో కష్టనష్టాలను భరిస్తూ కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విశేష పోరాటపటిమ ప్రదర్శిస్తున్న భారతీయుల్లో స్పూర్థిని నింపడానికి పర్వతంపై త్రివర్ణ పతాకం రంగులను ప్రొజెక్ట్ చేశారు. దీంతో ఎత్తైన మాటర్‌హార్న్ పర్వతం అంతా మూడు రంగుల వెలుగు జిలుగులను ప్రదర్శించింది.
ఈరోజు కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ సంక్షోభంగా ఉన్న నేపథ్యంలో రేపటి భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఆశావాహ దృక్పథాన్ని కలిగి ఉండాలని చేసే ప్రయత్నంలో భాగంగా గత నెల మార్చి 24 నుండి స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న 14,690 అడుగుల ఎత్తైన మాటర్‌హార్న్ పర్వతంపై కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వివిధ దేశాల జాతీయ జెండాల కాంతులతో పాటు #hope, “#StayAtHome” , #AllOfUs అనే హ్యాష్‌ట్యాగ్‌లను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు జపాన్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఇటలీ మరియు ఇండియా జెండా కాంతులను వెలిగించారు.
Here's the FB Post by Zermatt Matterhorn:
భారత్ వంతు వచ్చినపుడు, త్రివర్ణ పతాక రంగులను ప్రదర్శించారు ప్రతీ భారతీయుడి గుండె దేశభక్తితో పులకరించిపోయేలా ఉన్న ఆ దృశ్యాన్ని స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దానిని భారత ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేశారు. ప్రపంచమంతా ఏకమై చేస్తున్న ఈ పోరాటంలో మానవత్వమే తప్పక జయిస్తుందని మోదీ పేర్కొన్నారు.
Here's the tweet by PM Narendra Modi:
భారతదేశంలో శనివారం ఉదయం నాటికి COVID-19 కేసులు 14,378 గా నమోదయ్యాయి. దేశంలో మరణించిన వారి సంఖ్య 480 కు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, 193 దేశాలలో మొత్తం 2.2 మిలియన్లకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 150,000 దాటింది.