New Delhi, April 18: గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1991 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో భారతదేశంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 14,378 దాటింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 43 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 1991 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 18 న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 11,906 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19తో మరణించిన వారి సంఖ్య 480కి చేరింది.
అత్యధికంగా 3320 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంది. న్యూ ఢిల్లీలో 1,640 కేసులు, తమిళనాడులో 1,267, రాజస్థాన్ రాష్ట్రంలో 1,131 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరుసగా 766 మరియు 572 కేసులు నమోదయ్యాయి.
Take a Look at the COVID-19 update:
991 new #COVID19 cases and 43 deaths have been reported in the last 24 hours: Ministry of Health & Family Welfare https://t.co/2Qqt5u38SE
— ANI (@ANI) April 18, 2020
శుక్రవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,35,123 నమూనాలను COVID-19కు నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.
భారతదేశంలో రోజురోజుకి COVID-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, పిపిఇలు, మాస్క్ లు, వెంటిలేటర్లు మరియు ఇతర వైద్య పరికరాల తయారీలో నాణ్యతా ప్రమాణాలను తగ్గించవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పిపిఇలు, మాస్క్ మరియు వెంటిలేటర్లను తయారుచేసేటప్పుడు నిర్ధేశించిన నాణ్యతా ప్రమాణాలలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే తయారీదారులకు కఠినమైన శిక్షలు విధిస్తామని హర్ష వర్ధన్ హెచ్చరించారు.