Modi Meets Abe: రష్యాలో జపాన్ ప్రధానితో భేటి అయిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపరుస్తామని ఇరుదేశాల ప్రధానుల ప్రతిజ్ఞ.
ఇరు దేశాల ప్రధానులు ఇలా వరుసగా కలుసుకోవడం ద్వారా....
Vladivostok, Russia, September 05: ఐదవ తూర్పు ఆర్థిక ఫోరం సదస్సు (5th EEF)లో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారం జపాన్ ప్రధాని షింజో అబే (Shinzo Abe)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ - జపాన్ దేశాల మధ్య సహాయసహాకారాలు మరింత బలపడాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు భారత్ - జపాన్ దేశాల మధ్య ఆర్థిక మరియు రక్షణ రంగాలు సహా ఆవశ్యకమైన అన్ని రంగాలలో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పుతామని ప్రతిజ్ఞ చేశారు.
ఇంతకుముందు జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జి -20 సమ్మిట్‌లో మరియు ఇటీవల ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌లో జరిగిన జి7 సదస్సుల తర్వాత మోదీ, అబేలు కలుసుకోవడం ఇది మూడోసారి. ఇరు దేశాల ప్రధానులు ఇలా వరుసగా కలుసుకోవడం ద్వారా ఇండియా మరియు జపాన్ మధ్య సంబంధాలు కాంక్రీట్ అంత దృఢంగా బలపడతాయని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రధాని మోదీ పర్యటన ద్వారా భారత దేశానికి ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయబడుతున్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. మోదీ- అబేల భేటీ ద్వారా ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, భద్రత, స్టార్ట్-అప్ మరియు 5 జి తదితర రంగాలలో పరస్పర అవగాహన కుదిరింది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
అబేతో భేటీ తరువాత మోడీ మలేషియా ప్రధాని మహతీర్ బిన్ మొహమాద్, మంగోలియా అధ్యక్షుడు ఖల్త్మాగిన్ బటుల్గాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
రష్యన్ ఫార్ ఈస్ట్ రీజియన్‌లో వ్యాపార మరియు పెట్టుబడి అవకాశాల అభివృద్ధికి సంబంధించి ఈ సదస్సు ఉపయోగపడుతుంది. మరియు ఈ ప్రాంతంలో భారతదేశం మరియు రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు, పరస్పర సహకారం పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. రష్యన్ ఫార్ ఈస్ట్ రీజియన్ లో భారత్ తరఫున పర్యటించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం.