Iraq: కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన 20 మంది కోవిడ్ పేషెంట్లు, మరికొందరికి తీవ్ర గాయాలు, ఇరాక్ నస్రీయా నగరంలోని అల్ హుస్సేయిన్ ఆస్పత్రిలో విషాద ఘటన
ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవాళ్లంతా కరోనా పేషెంట్లేనని అధికారులు ధృవీకరించారు. కాగా, మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో ప్రమాద తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Baghdad, July 13: ఇరాక్‌లో ఓ ఆస్పత్రి కొవిడ్ వార్డులో ఘోర అగ్నిప్రమాదం (COVID-19 Hospital Fire) చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవాళ్లంతా కరోనా పేషెంట్లేనని అధికారులు ధృవీకరించారు. కాగా, మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో ప్రమాద తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాక్ నస్రీయా నగరంలోని అల్ హుస్సేయిన్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన (Fire Breaks Out at COVID-19 Imam Al-Hussein Hospital) చోటు చేసుకుంది. ఆక్సిజన్ ట్యాంకర్లు పేలడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న పేషెంట్లంతా మంటల్లో చిక్కుకుని హాహా కారాలు చేశారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఒకరిద్దరు నర్సులు తప్ప విధులు ఎవరూ లేరు. దీంతో వాళ్లను రక్షించే ప్రయత్నాలు ఫలించలేదు.
కాగా, ఆ వార్డులో కెపాసిటీ 70 పడకలుగా తెలుస్తోంది. 3 నెలల క్రితం ఈ కరోనా వార్డును ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఇరాక్‌లో గత మూడునెలల్లో ఇలాంటి ఘటన రెండోది ఇది. ఏప్రిల్‌లో రాజధాని బాగ్దాద్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 82 మంది మరణించగా.. 110 మంది గాయపడ్డారు. ఇక నస్రీయా ఘటన తర్వాత భారీగా ఆస్పత్రి ముందుకు చేరుకున్న జనాలు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం అంటూ నిరసన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ఆసుపత్రిని మంటలతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో కొవిడ్ వార్డుల్లో చిక్కుకున్న బాధితులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఇరాక్ ఇప్పటివరకు 14 లక్షల కొవిడ్ కేసులు నమోదు కాగా, 17,000పైగా చనిపోయారు.