Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

Brussels, July 12: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ మహమ్మారి ఒక్కోవ్యక్తిలో ఒక్కో విధంగా ప్రభావాన్ని చూపుతోంది. కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు (COVID-19 Alpha, Beta Variants) విస్తృతమైన వ్యాప్తి, ఎక్కువ ప్రభావం కలిగి ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఓ వృద్ధురాలిలో ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. బెల్జియానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలిలో ఈ రెండు రకాలు నిర్ధారణ అయినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి ప్రాణాలు కోల్పోయినట్లు (90-Year-Old Belgian Woman Die) యూరోపియన్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ నివేదిక వెల్లడించింది.

బెల్జియంలోని ఆల్ట్స్‌ నగరానికి చెందిన ఓ వృద్ధురాలి(90)కి కరోనా లక్షణాలు ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు జరిపిన పరీక్షల్లో ఆమెకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. తొలుత ఆక్సిజన్‌ స్థాయులు సరిపడా ఉన్నప్పటికీ ఐదు రోజుల అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె నమూనాలకు జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టగా.. ఆమెకు ఆల్ఫా, బీటా రెండు వేరియంట్లు (Coronavirus Double Variant Infection) సోకినట్లు తేలింది. నర్సింగ్‌హోం సంరక్షణలో ఉన్న ఆ వృద్ధురాలు వ్యాక్సిన్‌ తీసుకోలేదని వైద్యులు గుర్తించారు.

కలవరపెడుతున్న థర్డ్ వేవ్ ముప్పు, మహారాష్ట్రలో 8 జిల్లాల్లో కరోనా డేంజర్ బెల్స్, దేశంలో తాజాగా 37,154 మందికి కోవిడ్, ప్ర‌స్తుతం 4,50,899 యాక్టివ్ కేసులు

రెండు వేర్వేరు ఇన్‌ఫెక్షన్లు సోకిన వ్యక్తుల నుంచి వృద్ధురాలికి ఈ వేరియంట్లు సోకి ఉండొచ్చని ఓఎల్‌వీ ఆస్పత్రి నిపుణురాలు అన్నే వంకీర్‌బర్గన్‌ పేర్కొన్నారు. కచ్చితంగా ఆమెకు రెండు వేరియంట్లు ఎలా సోకాయనే విషయం అంతుచిక్కడం లేదన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించడానికి కో-ఇన్‌ఫెక్షన్‌ (ఒకేసారి రెండు వేరియంట్లు) కారణమని చెప్పడం కూడా కష్టమేనని తెలిపారు.