New Delhi, July 12: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 37,154 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదు కాగా, 724 మంది మరణించినట్లు (Covid Deaths) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 97.22 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 4,08,764 మంది (Covid deaths) చనిపోయారు. కరోనా నుంచి మరో 39,649 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,00,14,713. దేశంలో ప్రస్తుతం 4,50,899 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,74,376. ఇప్పటి వరకు 37.73 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరగగా, గడిచిన 24 గంటల్లో 12,35,287 మంది టీకాలు వేయించుకున్నారు.
రేట్ ఆఫ్ గ్రోత్ (ఆర్-నంబర్) పెరుగుదలను పరిశీలిస్తే..దేశంలో కరోనా మూడోముప్పు (Coronavirus Thirdwave) సూచనలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మే 15వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ మధ్య ఆర్ విలువ 0.78 నుంచి 0.88కు పెరిగింది. ఫలితంగా యాక్టివ్ కేసుల తగ్గుదల నిలిచిపోతున్నదని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకుడు సీతాభ్ర సిన్హా తెలిపారు. ఆర్ విలువను 1 కంటే తక్కువగా ఉండేలా చూస్తూ.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తేనే మహమ్మారికి ముకుతాడు వేయవచ్చని సూచించారు.
వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని రేట్ ఆఫ్ గ్రోత్ (ఆర్-నంబర్)గా పేర్కొంటారు. ఆర్ విలువ 0.88గా నమోదైందంటే 100 మంది కొవిడ్ పాజిటివ్ బాధితుల నుంచి వ్యాధి 88 మందికి సోకుతున్నట్టు అర్థం. ఆర్ విలువ 1 దాటిందంటే.. వ్యాధి వ్యాప్తిరేటు శరవేగంగా పుంజుకుంటుందని గమనించాలి. ప్రస్తుతం కేరళలో ఆర్ విలువ 1.1గా, మహారాష్ట్రలో ఆర్ విలువ 1గా నమోదవుతున్నది.
మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 8,535 కరోనా కేసులు వెలుగుచూడగా, 156 మంది వైరస్‌తో మరణించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుతున్నా, 8 జిల్లాల్లో మాత్రం కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్, రాయ్ గడ్, సింధూదుర్గ్, రత్నగిరి, పూణే రూరల్, సాంగ్లీ జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం కొల్హాపూర్ జిల్లాలో 1,097 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. సాంగ్లీ జిల్లాలో 1,097, సాతారాలో 755, రత్నగిరిలో 455, పూణే రూరల్ పరిధితోపాటు పింప్రీ చంచ్ వాద్ లో 1,072 కరోనా కేసులు వెలుగుచూశాయి.
మూడు రోజుల విరామం తరువాత ఈరోజు నుంచి ముంబైలోని అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో తిరిగి టీకాలు వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ముంబైకి 85 వేల డోసుల వ్యాక్సిన్ అందడంతో ఈ రోజు నుంచి ప్రజలకు టీకాలు వేయనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ టీకాలు వేయనున్నారు. ఈ 85 వేల డోసులు రెండు రోజులకు సరిపోతాయని బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. తరువాత వ్యాక్సినేషన్ తిరిగి నిలిపివేయాల్సివన్తుందన్నారు.
కేంద్రం ఇంకా మహారాష్ట్రకు ఒక కోటీ 44 లక్షల వ్యాక్సిన్ డోసులను అందించాల్సి ఉందన్నారు. కాగా ముంబైలో ఏర్పాటు చేసిన 283 వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా రోజుకు 1.5 లక్షల వ్యాక్సిన్లే వేసే సామర్థ్యం ఉంది. అయితే కేంద్రం నుంచి తగిన మోతాదులో వ్యాక్సిన్ రాకపోవడం వలన వ్యాక్సినేషన్‌లో జాప్యం జరుగుతున్నదన్నారు. కాగా మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 8,535 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 156 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,013 మంది కరోనా నుంచి కోలుకున్నారు.