
New Delhi, July 10: భారత్‌లో మరో అతిపెద్ద డ్రగ్ రాకెట్ గుట్టు (Major Drug Bust In Delhi) రట్టయ్యింది. దేశ రాజధాని దిల్లీలో రూ. 2,500 కోట్లు విలువచేసే 354 కిలోల హెరాయిన్‌ను దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ముంబయి నుంచి వచ్చిన ఓ కంసైన్‌మెంట్‌ను తనిఖీ చేయగా భారీ మొత్తంలో హెరాయిన్ (Delhi Police seizes 350 kg of heroin) బయటపడింది. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారి నీరజ్ ఠాకూర్ ఈ కేసు వివరాలు వెల్లడించారు.
ఈ మాదకద్రవ్యాలు అఫ్గానిస్థాన్ నుంచి ముంబయి మీదుగా దిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్‌ను దాచేందుకు ఈ ముఠా ఫరీదాబాద్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని.. అక్కడి నుంచి వీటిని పంజాబ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైనట్లు నీరజ్ పాండే పేర్కొన్నారు. నిందితుల్లో ముగ్గురు హరియాణాకు చెందినవారు కాగా మరొకరు దిల్లీ వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ముఠాకు పాకిస్థాన్‌తో కూడా సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.