Israel-Palestine Conflict: గాజా దాడులకు కారణాలు ఏమిటి, నాలుగో యుద్ధం తప్పదన్నసంకేతాలు ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఘర్షణలపై చర్చించేందుకు 57 ఇస్లామిక్ దేశాల కూటమి అత్యవసర సమావేశం
హమాస్ కేంద్ర స్థావరమైన గాజా సిటీపై వరుసగా వైమానిక దాడులు (Israel-Palestine Conflict) సాగిస్తోంది. వారం క్రితం మొదలైన ఘర్షణలు ఆదివారం తీవ్రరూపం దాల్చాయి. గాజా సిటీపై (Gaza City) ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడటంతో మూడు భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.
Gaza City, May 17: పాలస్తీనా హమాస్ తీవ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. హమాస్ కేంద్ర స్థావరమైన గాజా సిటీపై వరుసగా వైమానిక దాడులు (Israel-Palestine Conflict) సాగిస్తోంది. వారం క్రితం మొదలైన ఘర్షణలు ఆదివారం తీవ్రరూపం దాల్చాయి. గాజా సిటీపై (Gaza City) ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడటంతో మూడు భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.
కూలిన ఈ భవనంలోనే అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ), అల్–జజీరా ఛానల్‌తోపాటు ఇతర మీడియా సంస్థల ఆఫీస్‌లున్నాయి. ఈ ఘటనలో కనీసం 42 మంది మరణించారు. ఇందులో 12 మంది మహిళలు, 8 మంది పిల్లలు ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 50 మంది గాయపడ్డారని తెలిపింది.
ఉగ్రవాద సంస్థ హమాస్ టాప్ లీడర్లలో ఒకరైన యహియేహ్ సిన్‌వార్ నివాసాన్ని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ (Israel Army) వెల్లడించింది. దాడి జరిగిన సమయంలో అతను ఇంట్లో లేడని వివరించింది. జెరూసలేంలోని ఆల్-ఆక్సా మసీదు వద్ద గతవారం స్థానికులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారితీసింది. దీంతో పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు.
ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులతో రెచ్చిపోయింది. ఈ ఘటనల్లో ఇప్పటివరకూ కనీసం 188 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 55 మంది పిల్లలు, 33 మంది మహిళలు ఉన్నారు. మరో 1,230 మంది గాయపడ్డారు. ఇటువైపు 8 మంది ఇజ్రాలెయన్లు మృత్యువాతపడ్డారు. ఇందులో ఐదేండ్ల బాలుడు, సైనికుడు కూడా ఉన్నారు.
కాల్పుల విరమణ దిశగా ఇరు వర్గాలను ఒప్పించేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుండగా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య నాలుగో యుద్ధం తప్పదన్న సంకేతాలను ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇచ్చారు. హమాస్‌పై పూర్తిస్థాయిలో దాడులు కొనసాగుతాయన్నారు. హమాస్ భారీ మూల్యం చెల్లించాలని ఇజ్రాయెల్ కోరుకుంటోందన్నారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదం ముదురుతుండటం, దాడుల్లో అమాయక ప్రజలు మరణిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. తాజా ఘర్షణలపై చర్చించేందుకు 57 ఇస్లామిక్ దేశాల కూటమి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యింది. స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండే అర్హత పాలస్తీనియన్లకు ఉందని ఇస్లామిక్ దేశాల కూటమి అభిప్రాయపడింది. పాలస్తీనాపై దాడులను వెంటనే నిలిపివేయాలని 57 ముస్లిం దేశాల సమాఖ్య ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేసింది.
ఈ దాడులతో అమాయకులైన ముస్లిం ప్రజలు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, గొడవ సద్దుమణిగేలా మధ్యవర్తిత్వం చేయాలన్న ఈజిప్టు ప్రయత్నాలు ఫలించలేదు. ఏడాది పాటు సంధి చేసుకోవాలని, ఘర్షణ ఆపాలని ఈజిప్టు సూచించగా, హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ నో చెప్పింది.
జెరూసలేం, గాజాలో తాజా పరిస్థితికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని కొన్ని ఇస్లామిక్ దేశాలు తేల్చిచెబుతున్నాయి. ఇంకోవైపు, శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని ప్రముఖ మీడియా భవనాలు ధ్వంసమవడంపై అమెరికా స్పందించింది. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ నడుమ రగులుతున్న హింసాకాండను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు భవిష్యత్తును నిర్మించాలని కోరుకోవడం లేదని, కేవలం నాశనం చేయాలని భావిస్తున్నారని ఆక్షేపించారు. ఇరు వర్గాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని సూచించారు.
ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, గాజాలో మానవత్వంపై దాడి చేస్తోందని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్–మాలికీ ఆరోపించారు. ‘పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న దారుణాలను వర్ణించడానికి పదాలు లేవు. కుటుంబాలను తుడిచిపెడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జెరూసలేం నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా వెళ్లగొట్టాలని ఇజ్రాయెల్ చూస్తోందన్నారు. ఇంకెంత మంది చనిపోతే మీరు ఈ దాడులను ఖండిస్తారని ఐరాస భద్రతా మండలిని నిలదీశారు.
మరోవైపు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, దాడులకు పాల్పడవద్దని భారత్ విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తతలు తగ్గడమే తక్షణావసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.త్రిమూర్తి అన్నారు. పాలస్తీనాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. గాజాలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. వెంటనే దాడులు ఆగాలన్నారు.