New York, Feb 05: ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూతో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
మంగళవారం శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ, అవసరమైతే అమెరికా గాజా స్ట్రిప్‌ను స్వాధీనం (US will Take over Gaza Strip) చేసుకుంటుందని మరియు ఈ ప్రాంతంలో అమెరికన్ దళాలను మోహరిస్తుందని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్, గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడం అనేది "దీర్ఘకాలిక యాజమాన్య స్థానం" అని, ఇది మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతానికి "గొప్ప స్థిరత్వాన్ని" తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు.
గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడం గురించి విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, "మేము దానిని స్వంతం చేసుకుంటాము. ఆ ప్రదేశంలో ఉన్న ప్రమాదకరమైన పేలని బాంబులు, ఇతర ఆయుధాలన్నింటినీ కూల్చివేసే బాధ్యతను మేము తీసుకుంటాము" అని అన్నారు. తాము గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ట్రంప్ చెప్పారు.
గాజా ప్రాంతం పునర్ నిర్మాణం ద్వారా వేల కొద్ది ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఇది మధ్యప్రాచ్య ప్రజలందరికీ గర్వ కారణం అవుతుందని ట్రంప్ అన్నారు. అయితే గాజా స్ట్రిప్‌పై అమెరికా ఏ విధమైన నియంత్రణను చేపడుతుంది..? చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అదేవిధంగా జో బైడెన్ విదేశీ వ్యూహాన్ని ట్రంప్ విమర్శించారు. మధ్యప్రాచ్యంలో నాలుగేళ్లుగా బైడెన్ ఏదీ చేయలేదని, తన అసమర్థతను మాత్రమే చాటుకున్నారని ఆరోపించారు.
పాలస్తీనా ప్రజల శాశ్వత పునరావాసం అంశాన్ని ప్రస్తావిస్తూ.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ – పాలస్తీనా సంఘర్షణకు ఒక పరిష్కారంగా రెండు దేశాల వ్యవస్థను సమీక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ట్రంప్ చెప్పిన చర్య చరిత్రను మార్చగలదని నమ్ముతున్నట్లు వెల్లడించారు. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, హమాస్‌ను నిర్మూలించడానికి అమెరికా మార్గదర్శకత్వం సమర్థవంతంగా ఉండగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా ట్రంప్ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ప్రకటనపై పాలస్తీనియన్‌లు, ఇజ్రాయెల్ సహా ఇతర అరబ్ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
ట్రంప్ ప్రకటనపై నెతన్యాహూ స్పందిస్తూ.. గాజాపై అమెరికా అధ్యక్షుడి ప్రకటన చరిత్రను మారుస్తుందన్నారు. అయితే హమాస్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని హమాస్ నేత సమీఅబు జుహ్రీ అన్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించడానికే ఈ ప్రకటన చేశారని విమర్శించారు. తమ ప్రజలు దీనిని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించరని, వారి భూమి నుంచి వారిని తరలించడమే కాకుండా.. ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉందని వెల్లడించారు.
కాగా, గాజా, వెస్ట్ బ్యాంక్‌లలోని పాలస్తీనీయులను తాత్కాలికంగా ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు తరలించాలని గతంలో ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే దీనిని అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇటువంటి ఆలోచనలు ఈ ప్రాంతంలో సుస్థిరతకు ముప్పు తెస్తాయని, ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని, ప్రజలు ప్రశాంతంగా జీవించే అవకాశాలు ఉండవని ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దేశాలు వెల్లడించారు. మధ్య ప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.