Gaza Food Crisis: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో గాజాలో ఆకలి కేకలు, అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్న 23 లక్షల మంది ప్రజలు
అక్కడున్న మొత్తం 23 లక్షల మందీ జనాభా ఆహార కొరతతో విలవిలలాడుతుండగా వారిలో దాదాపు 5,76,000 మంది తీవ్ర కరువుతో అన్నమో రామచంద్రా (Gaza Food Crisis) అంటూ అలమటిస్తున్నారు
Hamas, Febuary 1: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో (Israel's War on Gaza) గాజాలో ఆకలి కేకలు మిన్నంటాయి. అక్కడున్న మొత్తం 23 లక్షల మందీ జనాభా ఆహార కొరతతో విలవిలలాడుతుండగా వారిలో దాదాపు 5,76,000 మంది తీవ్ర కరువుతో అన్నమో రామచంద్రా (Gaza Food Crisis) అంటూ అలమటిస్తున్నారు. 80 శాతం మంది గాజావాసులు ఇజ్రాయెల్ దాడులకు తాళలేక, దాని బెదిరింపులకు తలొగ్గి ఇప్పటికే ఇల్లూ వాకిలీ వదిలేశారు. కొద్ది నెలలుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎలాంటి సహాయక సామగ్రినీ ఇజ్రాయెల్ అనుమతించకపోవడంతో అన్నమో రామచంద్రా అంటూ అంతా అలమటిస్తున్నారు.
రెండేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి సహాయక సంస్థ ప్రతినిధి తెలిపారు. మిగిలిన వారూ సరైన ఆహారం దొరక్క అలమటిస్తున్నారని వెల్లడించారు.ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) తాజా నివేదికలో కనీసం 5 లక్షల మంది అత్యంత తీవ్రమైన కరువు బారిన పడ్డారని ఆవేదన వెలిబుచ్చింది. వారికి తక్షణ సాయం అందకపోతే అతి త్వరలోనే గాజా ఆకలిచావులకు ఆలవాలంగా మారడం ఖాయమని హెచ్చరించింది.
జోర్డాన్, యూఏఈ, ఈజిప్టు, ఫ్రాన్స్ నుంచి వచ్చిన విమానాల ద్వారా మంగళవారం గాజాలో ఆహార పొట్లాలను జారవిడిచామని జోర్డాన్ వెల్లడించింది. గాజా సిటీలోని కమల్ అద్వాన్ ఆసుపత్రిలో ఇద్దరు శిశువులు అతిసార, పోషకాహార లోపంతో మరణించారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. గాజాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే కావచ్చని ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మున్ముందు అక్కడ పదులు, వందలు, వేలల్లో, అంతకుమించి ఆకలి చావులు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నాయి.
హమాస్ మిలిటెంట్లు ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, గాజాలో 25 వేలు దాటిన మృతుల సంఖ్య
అతిసార, పోషకాహార లోపంతో వేల మంది శిశువులు, గర్భిణులు మరణించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించాలని కోరుతూ ఇజ్రాయెల్‌లోని వారి బంధువులు, మద్దతుదారులు జెరూసలెం వరకూ నాలుగు రోజుల ర్యాలీని ప్రారంభించారు. దక్షిణ ఇజ్రాయెల్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది.
ప్రతీకారేచ్ఛతో పాలస్తీనాపై నాలుగున్నర నెలలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆ క్రమంలో గాజా స్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేయడమే ఇందుకు కారణం. గాజాకు ఆహారం, నిత్యావసరాల సరఫరాను కూడా ఇజ్రాయెల్ వీలైనంతగా అడ్డుకుంటూ వస్తోంది. చివరికి ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల సాయాన్ని కూడా అనుమతించడం లేదు. దాంతో గాజావాసులు అల్లాడిపోతున్నారు. శరణార్థి శిబిరాలు నరకప్రాయంగా మారాయి.
యుద్ధం మొదలైన తొలినాళ్లలో గాజాలోకి రోజుకు 500 పై చిలుకు వాహనాల్లో సహాయ సామగ్రి వచ్చేది. ఇప్పుడవి 10కి దాటడం లేదు! ఉత్తర గాజాలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతానికి ఎలాంటి మానవతా సాయమూ అందక ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కూడా చివరిసారిగా జనవరి 23 అక్కడికి సహాయ సామగ్రిని పంపింది. ఆకలికి తట్టుకోలేక గాజావాసులు చివరికి కలుపు మొక్కలు తింటున్నారు. పలు ప్రాంతాల్లో ఆకలికి తాళలేక గుర్రాల కళేబరాలనూ తింటున్నారు!