గాజాలో ఇజ్రాయెల్ సైన్యం (IDF) తమ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ (Khan Younis)ను తమ బలగాలు చుట్టుముట్టినట్లు తాజాగా ప్రకటించింది. ఇదిలా ఉంటే హమాస్ ఉగ్రవాదులు సోమవారం కూల్చివేతకు సిద్ధమవుతున్న గాజా కాంపౌండ్ పక్కన ఉన్న భవనంపై యాంటీ ట్యాంక్ క్షిపణిని ప్రయోగించడంతో ఇరవై ఒక్క ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. దీనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటన విడుదల చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చాలా కష్టతరమైన రోజులను అనుభవించానని అతను చెప్పాడు
హమాస్ మిలిటెంట్లు ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, గాజాలో 25 వేలు దాటిన మృతుల సంఖ్య
తమ రక్షణ సిబ్బంది మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నెతన్యాహు (Netanyahu).. హమాస్‌పై సంపూర్ణ విజయం సాధించేవరకు పోరాడతామని మరోసారి స్పష్టం చేస్తూ బందీల (Israeli Hostages)ను విడిపించుకుంటామన్నారు. కొంతకాలంగా ఖాన్ యూనిస్‌లో తీవ్ర పోరు కొనసాగుతోంది. ఉగ్రసంస్థ అగ్రనేతలు ఈ నగరం కింది సొరంగాల్లో దాక్కున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. అంతకుముందు స్థానికంగా ఐడీఎఫ్ జరిపిన దాడిలో 50 మంది పాలస్తీనావాసులు మృతి చెందిన విషయం తెలిసిందే.