IPL Auction 2025 Live

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు, వారిలో 9 వేల మంది విద్యార్థులే, నిరంతరం వారితో టచ్‌లో ఉన్నామని తెలిపిన జైశంకర్

ఆందోళనలు (Bangladesh Crisis) మొదలైన జూలై నెలలోనే చాలామంది వచ్చేశారని చెప్పారు.

EAM Jaishankar (Photo-X/EAM Jaishankar)

New Delhi, August 7: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్ననేపథ్యంలో అక్కడ మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 9 వేల మంది విద్యార్థులేనని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఆందోళనలు (Bangladesh Crisis) మొదలైన జూలై నెలలోనే చాలామంది వచ్చేశారని చెప్పారు. బంగ్లాదేశ్ సైన్యంతో పాటు మన రాయబార కార్యాలయాల ద్వారా వారితో సంప్రదింపుల్లో ఉన్నామని, వారికి (Estimated 19k Indians in Bangladesh) భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని ఆయన పార్లమెంటులో అన్నారు.

మైనారిటీలకు చెందిన ఆలయాలు, వ్యాపార కేంద్రాలపై దాడులు జరుగుతున్నట్లుగా మాత్రం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికిప్పుడు భారతీయులను తరలించేంతటి తీవ్ర స్థాయి పరిస్థితులు బంగ్లాదేశ్‌లో లేవని స్పష్టం చేశారు. అక్కడి యంత్రాంగం మన రాయబార కార్యాలయాలు, ప్రజలకు భద్రత కల్పిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. షేక్ హసీనాను అరెస్ట్ చేయండి.. ఆ తర్వాత మాకు అప్పగించండి.. భారత్‌ ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోయేషన్

బంగ్లాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జైశంకర్‌ మంగళవారం లోక్‌సభ, రాజ్యసభలలో ప్రకటన చేశారు. కేంద్ర హోం, రక్షణ శాఖ మంత్రులు, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఇండియా కూటమి నేతలు హాజరైన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. పరిస్థితులను తాము నిరంతరం నిశితంగా గమనిస్తున్నామని, భద్రతా దళాలను అత్యంత అప్రమత్తం చేశామని వివరించారు.

బంగ్లాదేశ్ ప్రధాని హసీనా ప్రస్తుతం షాక్‌లో ఉన్నారని, కొంచెం కోలుకున్నాక ఆమెతో మాట్లాడతామని జైశంకర్‌ తెలిపారు. మానవతా దృక్పథంతోనే ఆమెకు ఆశ్రయం ఇచ్చామని, భవిష్యత్‌పై నిర్ణయానికి సమయం ఇద్దామన్నారు. తక్షణం భారత్‌కు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ హసీనా నుంచి సంక్షిప్త సందేశం వచ్చిందని ఎంపీలకు వివరించారు.

కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఢాకాలో ఆందోళనకారులు సమావేశం కావడంతో పరిస్థితి తీవ్రత తెలిసిన ఆమె భద్రతాధికారులతో సమావేశమై రాజీనామా నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్నారు. హసీనా వినతితో బంగ్లాదేశ్ నుంచి విమానం రాకకు అనుమతి ఇచ్చామని తెలిపారు. దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌తో మనకున్న సన్నిహిత సంబంధాలు, ప్రస్తుతం అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు.

హసీనాను దించేయడంలో పాక్‌ పాత్ర ఉందా? అంటూ అఖిలపక్ష సమావేశంలో రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని జైశంకర్‌ బదులిచ్చారు. బంగ్లాలోని పాక్‌ దౌత్తవేత్త ఒకరు ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనలను సమర్థిస్తూ తన సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ పిక్‌ను మార్చుకున్నట్లుగా సమాచారం ఉందన్నారు.