Japan Earthquake: భూకంపం తర్వాత జపాన్‌పై మరో పిడుగు, కుండపోత వర్షంతో పాటు మరిన్ని భూకంపాలు వస్తాయని హెచ్చరిక, 62కు పెరిగిన మృతుల సంఖ్య
ఇదిలా ఉంటే మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇషికావా సెంట్రల్ ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం కదిలించింది.
జపాన్ దేశంలో సంభవించిన భూకంపంలో (Japan Earthquake) మృతుల సంఖ్య 62కు పెరిగింది. ఇదిలా ఉంటే మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇషికావా సెంట్రల్ ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం కదిలించింది. దీనివల్ల భవనాలు కూలిపోయాయి. తూర్పు రష్యా వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం కారణంగా జపాన్‌లోని వాజిమా సిటీలో పలు ఇళ్లు, 25 భవనాలు కూలిపోయాయి. కాగా శక్తివంతమైన భూకంపం తర్వాత కొండచరియలు విరిగిపడడం, భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
జపాన్‌లోని ఇషికావా కేంద్రంగా సోమవారం 7.6 తీవ్రతతో భారీ భూకంపం (7.6 Magnitude Quake Strikes Ishikawa Prefecture) సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో మొత్తం 21 సార్లు భూమి కంపించింది. ఈ భూకంపాల ధాటికి జపాన్ కకావికలం అయ్యింది. శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మరణాల సంఖ్య 62కు (62 Dead, Several Feared Trapped) చేరుకున్నది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. దాంతో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దాదాపు 32 వేల మంది నిరాశ్రయులుగా మారారని.. వారంతా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. తీర ప్రాంతంలోని సుజు పట్టణంలో దాదాపు 90 శాతం ఇళ్లు ధ్వంసమైనట్లు మేయర్ మషురో ఇజుమియా తెలిపారు. ఇప్పటికీ చాలా మంది సాయం కోసం వేచిచూస్తున్నారని స్వయంగా జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా బుధవారం తెలిపారు. వారందరినీ ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా స్థానిక యంత్రాంగాలన్నీ క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు.
హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో సంభవించిన భూకంపం తర్వాత మీటరు కంటే ఎక్కువ ఎత్తులో సునామీ తరంగాలు వచ్చాయి. మంటలు చెలరేగడంతోపాటు పలు రోడ్లు ఛిద్రమయ్యాయి. ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పం చాలా తీవ్రంగా దెబ్బతింది, అనేక వందల భవనాలు అగ్నిప్రమాదంతో ధ్వంసమయ్యాయి.