Kazakhstan Unrest: ఇంధన ధరల పెంపు, నిరసనలు చేసిన వారిని కాల్చి పడేయాలని కజకిస్తాన్ అధ్యక్షుడు ఆదేశాలు, కాల్పుల్లో 26 మంది ఆందోళనకారులు, 15 మంది పోలీసులు మృతి, పరిస్థితుల అదుపు కోసం రష్యా సాయం కోరిన కజకిస్తాన్
ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కజకిస్థాన్‌లో చేపట్టిన ఆందోళనలు తాజాగా హింసాత్మకంగా మారాయి.
Nur-Sultan, Jan 7: మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో ఎల్‌పీజీ గ్యాస్ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసన (Kazakhstan Unrest) గళం వినిపిస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కజకిస్థాన్‌లో చేపట్టిన ఆందోళనలు తాజాగా హింసాత్మకంగా మారాయి. ఆ దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై జరిపిన దాడులు రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని ఎటువంటి వార్నింగ్ లేకుండానే చంపేయాలంటూ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ తొకయేవ్ (President Kassym-Jomart Tokayev) ఆ దేశ బలగాలను ఆదేశించారు.
ఆల్మటి నగరంలో జరిగిన కాల్పుల్లో 26 మంది ఆందోళనకారులు ( 26 Protestors Killed, Thousands Arrested), 15 మంది పోలీసులు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. చనిపోయిన ఆందోళనకారులు సాయుధ నేరస్తులని ప్రభుత్వం చెబుతోంది. హింసాత్మక నిరసనల్లో మరో మూడు వేల మందిని అరెస్టు చేశారు. ఆల్మటి నగరంలో ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని, కానీ ఉగ్రవాదులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, అందుకే విధ్వంసక నిరసనకారుల్ని చంపేయాలంటూ పోలీసులకు, ఆర్మీకి ఆదేశాలు ఇచ్చినట్లు అధ్యక్షుడు తెలిపారు. ఆ నిరసనల్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నట్లు అధ్యక్షుడు ఆరోపించారు.
నైరుతి చైనాలోని ప్రభుత్వ కార్యాలయంలో పేలుడు, 20 మంది లోపల చిక్కుకుపోయారని అధికారులు వెల్లడి
ఒక పోలీసు అధికారి తల తెగి రోడ్డుపై పడి ఉండడం అక్కడ భయోత్పాతాన్ని రేపింది. అత్యవసర పరిస్థితుల్ని తోసిరాజని బుధవారం రాత్రికి రాత్రి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి అధ్యక్ష భవనం, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. మేయర్ ఆఫీస్ సహా పలు కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీసు శాఖ పోలీస్ శాఖ తెలిపింది.
నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు. ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. దేశంలో పరిస్థితులను అదుపు చేయడానికి శాంతి పరిరక్షణ దళాలను పంపించాల్సిందిగా రష్యా నేతృత్వంలోని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్‌కు అధ్యక్షుడు కసైమ్ జోమార్ట్ టొకాయెవ్ విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థన మేరకు రష్యా, దాని మిత్ర దేశాలు కజకిస్తాన్‌కు శాంతి బలగాలను పంపించనున్నాయి. దేశంలో పరిస్థితులపై రష్యా, చైనాతో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి. కజకిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి రావాలనుకొంటే ఏర్పాట్లు చేస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
కజకిస్తాన్ ప్రజలు ఎల్‌పీజీ గ్యాస్‌ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించాలన్న ఉద్దేశంతో పెట్రో ధరలపై ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేయడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గత ఆదివారం నుంచి నిరసనలకి దిగారు. స్థానికంగా దిగజారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని అస్కర్ మామిన్ నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేసినా.. పరిస్థితులు అదుపులోకి రాలేదు.
నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్న అల్మాటీ, మాంగిస్టౌ ప్రావిన్స్ తదితర ప్రాంతాల్లో జనవరి 19 వరకు అత్యవసర పరిస్థితి విధించారు. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేశారు. ఇదిలా ఉండగా.. ఐరాస, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఇరువర్గాలు సంయమనం పాటించాలని కోరారు. తమ నిరసనలను శాంతియుతంగా వ్యక్తపరిచేందుకు ప్రజలకు అనుమతివ్వాలని అమెరికా సూచించింది.