Earthquake in Morocco: ఆఫ్రికా దేశం మొరాకోను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదు.. కనీసం 296 మంది మృత్యువాత
అక్కడ భారీ భూకంపం (Earthquake) సంభవించడంతో.. కనీసం 296 మంది మృతి చెందారు.
Newdelhi, Sep 9: ఆఫ్రికన్ దేశం మొరాకోలో (Morocco) ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. అక్కడ భారీ భూకంపం (Earthquake) సంభవించడంతో.. కనీసం 296 మంది మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది.19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో భూమి మరోసారి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల 11 నిమిషాలకు భూకంపం వచ్చినట్టు గుర్తించారు. మొరాకోలోని హై అట్లాస్ మౌంటెన్స్ ప్రాంతంలో భూమికి 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది.
ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు
ప్రముఖ పర్యాటక ప్రాంతం మరాకేష్, మొరాకో దక్షిణ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మరణించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. 153 మంది గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించినట్టు వెల్లడించారు. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు కనిపిస్తున్నాయి. భూకంపానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారాయి.