Myanmar Political Crisis: సైన్యం అదుపులో మయన్మార్, ఆంగ్ సాన్ సూకీని బంధించిన మిలటరీ సైన్యం, ఆది నుంచి అక్కడ ఏం జరిగింది? సూకీని ఎందుకు బంధించారు. మయన్మార్ రాజకీయ సంక్షోభంపై ప్రత్యేక కథనం
ఆ దేశ సైన్యం మరోసారి తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఆధీనంలోకి (Myanmar Political Crisis) తీసుకున్నది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఆ దేశ మిలటరీ ప్రకటించింది.
Naypyitaw, February 1: మయన్మార్ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ దేశ సైన్యం మరోసారి తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఆధీనంలోకి (Myanmar Political Crisis) తీసుకున్నది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఆ దేశ మిలటరీ ప్రకటించింది. సోమవారం తెల్లవారు జామున మిలటరీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) నాయకురాలు, స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో ( State Counsellor Aung San Suu Kyi) పాటు దేశ అధ్యక్షుడు యు విన్‌మైంట్‌ను (U Win Myint) అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ సైన్యం తన సొంత టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రకటించింది.
దేశ ఉపాధ్యక్షుడు మింట్ స్వేను.. తాత్కాలిక అధ్యక్షుడిగా చేస్తూ ఆ దేశ సైన్యం (Myanmar military) ప్రకటన చేసింది. కమాండర్ ఇన్ చీఫ్ మిన్ ఆంద్ హయింగ్‌కు అన్ని అధికారాలను బదిలీ చేశారు. ఎన్నికల్లో మోసం జరగడం వల్లే అధికారాన్ని కమాండర్ ఇన్ ఛీఫ్ ఆంగ్ హయింగ్‌కు అప్పగిస్తున్నట్లు మిలిటరీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. రాజధాని నెపితా వీధుల్లో సైన్యాన్ని మోహరించారు.
గత 50 ఏళ్లుగా సైన్యం చేతిలోనే మగ్గి తేరుకున్న ఆ దేశంలో మళ్లీ సైనిక తిరుగుబాటుతో రాజకీయ సంక్షోభం (State Emergency) ఏర్పడింది. దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించిన సైన్యం నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకోవడం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో పాటు దేశమంతటా ఇంటర్‌నెట్ సేవలను ఆర్మీ నిలిపివేసింది. దీంతో అనేక మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయడంలేదు.
కాగా ఆ దేశ పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు సైన్యం ఈ తిరుగుబాటు చేసింది. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సైన్యం ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసింది. అక్రమాలపై ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను ఇప్పటికే సూకీ ప్రభుత్వం ఖండించింది. అప్పటి నుంచి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మిలటరీకి మధ్య ఉద్రిక్తతల రాజుకున్నాయి. ఈ క్రమంలోనే సైన్యం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున సైనికులు దాడి జరిపి అంగ్ సాన్ సూకీతో పాటు ఆ పార్టీ కి చెందిన ఇతర సీనియర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు.
అయితే తాజా పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా జరిగిన ప్రయత్నాలను అడ్డుకుంటే సహించేది లేదని అమెరికా ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని, ఎన్నికల ఫలితాలను గౌరవించాలని మయన్మార్ సైన్యాన్ని కోరింది. దేశంపై నియంత్రణ కోసం మిలటరీ మరోసారి ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నుకున్న నేత అంగ్ సాన్ సూకీ సహా ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
మయన్మార్ సైన్యం దేశంలో రాజకీయ అనిశ్చితి (Myanmar Declare State Emergency) నెలకొన్న నేపథ్యంలో దౌత్యపరమైన ప్రకటనలు ఏవీ చేయకూడదని ప్రకటన జారీ చేసింది. 2020లో జరిగిన ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని లక్షలాది మంది ఓటర్ల లిస్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు చేస్తోంది. 2020 ఎన్నికల ఫలితాలను వ్యతిరేకించడం లేదని, కానీ దాదాపు కోటి మంది ఓటర్ల జాబితాలో మార్పులు జరిగినట్లుగా చెబుతోంది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు సహకరిస్తామని అయితే దౌత్య కార్యాలయాలు ఎలాంటి అనుచిత ప్రకటనలు చేయవద్దని సైన్యం కోరింది.
2020 నవంబర్ 8వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఎన్ఎల్‌డీ పార్టీ 83 శాతం సీట్లను గెలుచుకున్నది. 2011లో సైనిక పాలన ముగిసిన తర్వాత.. రెండవసారి ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల ఫలితాలపై మిలిటరీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశాధ్యక్షుడితో పాటు ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టులో సైన్యం కేసు వేసింది. ఎన్నికల సంఘం మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. అయితే చర్యలు తీసుకుంటామని మిలిటరీ హెచ్చరించడంతో.. సైనిక తిరుగుబాటు తప్పదని భావించారు. తాజాగా అదే నిజమైంది.