Washington, Jan 25: అమెరికాలో తుఫాకి సంస్కృతి రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. అక్కడి ఇండియానాలో కాల్పుల కలకలం (Indianapolis Shooting) చెలరేగింది. ఇండియానా పోలీస్‌లో ఆదివారం తెల్లవారుజామున దుండగులు కాల్పులకు ( Indianapolis mass shooting) తెగబడ్డారు.ఈ ఘటనలో గర్భిణీతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డతో సహా గర్భిణీ స్త్రీ చనిపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.తీవ్రంగా గాయపడిన మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ కాల్పులను ఇండియానాపోలిస్ మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని పేర్కొన్నారు .దీనిపై స్థానిక పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు చేపట్టారని చెప్పారు. అటు గత దశాబ్దకాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో మరో మైనర్‌కి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స అందుతోందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం ఆ మైనర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అడమ్స్ స్ట్రీల్ 3500 బ్లాక్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. దుండగుడు ముందస్తు ప్రణాళిక ప్రకారమే కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.
బయటకు వచ్చిన నివేదికల ప్రకారం...ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఉదయం 4 గంటలకు నగరంలోని నార్త్‌సైడ్‌లో కాల్పుల కాల్‌కు స్పందించి గాయపడిన బాలుడిని కనుగొన్నారు. నివేదికల తరువాత, వారు సమీపంలోని ఇంటికి వెళ్లి అక్కడ చనిపోయిన ఐదుగురిని కనుగొన్నారు. బాలుడిని ఆసుపత్రికి తరలించగా, ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. అయితే బాధితుల గుర్తింపులను బహిరంగపరచలేదు. ఇదిలా ఉంటే గత సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా హత్యలు దాదాపు 21 శాతం పెరిగాయని ఎఫ్‌బిఐ క్రైమ్ డేటా సూచించింది.