Nepal’s Plane Crashes History: గడిచిన 12 ఏళ్లలో 11 విమాన ప్రమాదాలు, నేపాల్‌లో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు, ఎప్పుడెప్పుడు ప్రమాదాలు జరిగాయంటే?
2010 నుంచి గత 12 ఏండ్లలో 11 విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన పదేళ్లలో అనేక విమాన ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు
Katmandu, JAN 15: నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం (Pokhara Airport) సమీపంలో యతి ఎయిర్‌లైన్స్‌కు (Yeti Airlines) చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలి 72 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వారిలో 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, మరో 14 మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. అయితే, నేపాల్‌లో (Nepal plane crash) విమాన ప్రమాదాలు జరగడం ఇదే కొత్తేమీ కాదు. 2010 నుంచి గత 12 ఏండ్లలో 11 విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన పదేళ్లలో అనేక విమాన ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరి వాటిలో ఎప్పుడెప్పుడు ఏ ప్రమాదం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
2010 ఆగస్టు 24
ప్రతికూల వాతావరణం కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండులో చిన్న సైజు అగ్ని ఎయిర్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అమెరికన్‌లు, ఒక జపనీయుడు, ఒక బ్రిటిషర్ సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
2010 డిసెంబర్ 15
తూర్పు నేపాల్‌లో విమానం కూలిపోయి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఎక్కువగా భూటాన్ దేశానికి చెందిన యాత్రికులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక అమెరికా పౌరుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
2011 సెప్టెంబర్ 25
ఎవరెస్ట్ శిఖరం పరిసరాల్లో సైట్ సీయింగ్ కోసం వచ్చిన 19 మంది పర్యాటకులతో బయలుదేరిన ఓ చిన్న విమానం నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలోని కొండలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
2012 మే 14
మొత్తం 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న అగ్ని ఎయిర్ ప్లేన్ ఉత్తర నేపాల్‌లోని అత్యంత ఎత్తయిన ప్రాంతంలోగల జామ్సన్ ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలింది. ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే మరో ఆరుగురు మాత్రం ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడ్డారు.
2012 సెప్టెంబర్ 28
ఎవరెస్ట్ శిఖరాన్ని చూసేందుకు వచ్చిన 19 మంది యాత్రికులతో బయలుదేరిన విమానం మార్గమధ్యలో నేపాల్ రాజధాని ఖాట్మండు శివార్లలో కాలిపోతూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు బ్రిటిషర్‌లు, ఐదుగురు చైనీయులు సహా మొత్తం 19 మంది మరణించారు.
2014 ఫిబ్రవరి 16
నేపాల్‌లోని అర్ఘఖంచి జిల్లాలో నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతిచెందారు. ఆ తర్వాత రెస్క్యూ సిబ్బందికి పర్వత ప్రాంతాల్లో విమాన శకలాలు కనిపించాయి.
2016 ఫిబ్రవరి 24
తారా ఎయిర్ నడిపించే ట్విన్ ఒట్టర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యాగ్ది జిల్లాలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
2018 మార్చి 12
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బయలుదేరిన ఓ విమానం నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఎయిర్‌పోర్టులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ల్యాండవుతూనే ఫుట్‌బాల్ స్టేడియంలోకి జారిపోయిన విమానంలో కాసేపట్లోనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 51 మంది మరణించారు. ఆ దశాబ్దకాలంలో నేపాల్‌లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం అదే.
2019 ఏప్రిల్ 14
ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఓ చిన్న విమానం టేకాఫ్ అవుతూ రన్‌వే నుంచి జారిపోయింది. ఈ క్రమంలో రన్‌వే పక్కనున్న రెండు హెలిక్యాప్టర్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
2022 మే 29
నేపాల్ క్యారియర్ అయిన తారా ఎయిర్ నిర్వహించే ట్విన్ ఒట్టర్ విమానం పశ్చిమ నేపాల్‌లోని పొఖారా ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో దానిలో ఉన్న మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే, పై అన్ని విమాన ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం మాత్రం తాజాగా పొఖారా అంతర్జాతీయ విమనాశ్రయం సమీపంలో జరిగిన ప్రమాదమే. ఎందుకంటే ఈ ప్రమాదంలో 72 మంది మరణించారు. గత 12 ఏండ్లలో నేపాల్‌లో జరిగిన ఏ విమాన ప్రమాదంలో ఇంత భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరగలేదు.