Pak No Trust Vote: ఇమ్రాన్ ఖాన్ ఔట్, అర్ధరాత్రివరకు కొనసాగిన ఉత్కంఠ, అవిశ్వాసం ద్వారా తొలగించబడ్డ తొలి ప్రధానిగా ఇమ్రాన్ రికార్డు
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఇన్నింగ్స్‌కు మధ్యలోనే తెరపడింది. నెలరోజులపాటు కొనసాగిన రాజకీయ క్రీడకు ఎట్టకేలకు తెరపడింది. ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపైప్రత్యర్థి వర్గం పైచేయి సాధించింది. అవిశ్వాస తీర్మానానికి 174 మంది సభ్యులు అనుకూలంగా ఓటువేశారు.
Islamabad, April 10: రాజకీయ క్రీడలో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఇన్నింగ్స్‌కు మధ్యలోనే తెరపడింది. నెలరోజులపాటు కొనసాగిన రాజకీయ క్రీడకు ఎట్టకేలకు తెరపడింది. ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై (No Trust Vote) ప్రత్యర్థి వర్గం పైచేయి సాధించింది. అవిశ్వాస తీర్మానానికి 174 మంది సభ్యులు అనుకూలంగా ఓటువేశారు. దీంతో సాధారణ మెజారిటీ సాధించలేకపోవడంతో మాజీ క్రికెటర్ ప్రభుత్వం కుప్పకూలింది. అవిశ్వాస తీర్మానం (No Trust Vote) ద్వారా తొలగించబడిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ అపకీర్తి మూటగట్టుకున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు చివరివరకు ప్రయత్నించిన చివరకు అరెస్టుకు భయపడి దిగివచ్చారు. జాతీయ అసెంబ్లీలో అర్ధరాత్రి పొద్దుపోయాక తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఓటమి ఖాయమని తెలియడంతో ఇమ్రాన్ వర్గం ఓటింగ్‌కు దూరంగా ఉన్నది. సాధారణ మెజారిటీ సాధించకపోవడంతో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ను పాక్ పార్లమెంటు తప్పింది. దీంతో కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ (Shehabaz Sharif) ఎన్నికయ్యే అవకాశం ఉన్నది. కాగా, ఇమ్రాన్ ఖాన్‌పై కక్షసాధింపు చర్యలు ఉండవని షెహబాజ్ ప్రకటించారు.
శనివారం ఉదయం ప్రారంభమైన జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై హైడ్రామా నడిచింది. తీర్మానంపై పూర్తిస్థాయిలో చర్చ జరగకపోవడంతో పాటు ఇటు అవిశ్వాసంపై ఓటింగ్ జరగకుండా సభ వాయిదా పర్వంలో నడిచింది. ఓటింగ్‌కు ముందు అనూహ్యరీతిలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ నేత అయాజ్ సాధిక్ స్పీకర్‌గా వ్యవహరించి ఓటింగ్ చేపట్టారు.
పాక్ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు పార్లమెంట్ శనివారం సమావేశమైంది. సభ ప్రారంభం నుంచే అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదాలు కొనసాగాయి. తీర్మానంపై నేరుగా ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్ మాత్రం ఇమ్రాన్ ఆరోపించిన ‘విదేశీ కుట్ర’పై చర్చించేందుకు మొగ్గుచూపారు.